భారత ఆర్మీకి చెందిన ఓ ఫొటో వైరల్ అవుతున్నది. ఈ ఫొటో వెనుక ఉన్న కథపై చర్చ జరుగుతున్నది. మంచుపై తెల్లటి దుస్తులతో  అధునాతన రైఫిళ్లతో భారత ఆర్మీ వరుసగా నిలబడి ఉన్నది. వెనుక త్రివర్ణ పతాకం ఉన్నది. వీరికి ఇరువైపులా అన్ని వాతావరణ పరిస్థితుల్లో అనుకూలంగా వాహనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఉత్తర సిక్కింలో సుమారు 15 వేల అడుగుల ఎత్తులో తీశారు.

న్యూఢిల్లీ: ఆర్మీకి(Indian Army) సంబంధించిన ఏ చిత్రమైనా ఉత్సాహం, ఉత్తేజం ఉంటుంది. ఎవరికైనా వారి చిత్రాలు చూస్తే ఒక ఆశ, ఆత్మ విశ్వాసం మనసులో రెట్టింపు అవుతుంది. అందుకే ఆర్మీ ఫొటో ఏది చూసినా దాని వెనుక కథ ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొని ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ ఫొటో వైరల్(Viral Photo) అవుతున్నది. ఆ ఫొటోలో అన్ని రకాల పర్యావరణ పరిస్థితులను తట్టుకునే అధునాతన వాహనాలతో, 7.62 ఎంఎం ఎస్ఐజీ సూయర్ రైఫిళ్ల(7.62mm SiG Sauer rifles)తో వరుసగా నిలబడి ఉన్నారు. ఆ మంచుతో ఆవరించి ఉన్న ఆ నేలపై ఆర్మీ కూడా మంచులో కలిసిపోయినట్టు తెల్లటి దుస్తుల్లో ఉన్నారు. వారి వెనుక త్రివర్ణ పతాకం దర్శనం ఇస్తున్నది. ఈ చిత్రంపై చాలా చర్చ జరుగుతున్నది. ఎంతో మంది ఆ చిత్ర కథ తెలుసుకోవాలని ఆసక్తిగా వెతుకులాడుతున్నారు.

అమెరికాలో తయారైన ఎస్ఐజీ సూయర్ రైఫిళ్లను మన భారతీయ జవాన్లు పట్టుకుని ఉన్నారు. ఈ రైఫిళ్లను భారత ప్రభుత్వం ఇటీవలే ఆర్మీకి అందించింది. వీరితోపాటు పక్కనే అన్ని వాతావరణాలనుు తట్టుకుని సేవలు అందించే సామర్థ్యం ఉన్న వాహనాలూ ఉన్నాయి. ఈ ఫొటోగ్రాఫ్‌ను భూమి నుంచి 15,500 అడుగులు ఎత్తులో తీశారు. ఉత్తర సిక్కింలోని ముగుతాంగ్ సబ్ సెక్టార్‌లో ఈ ఫొటో తీసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇది చాలా ఎత్తైన ప్రాంతం. ఇదే సందర్భంలో ఓ అధికారి పై చిత్రం గురించి మాట్లాడుతూ భారత ఆర్మీ ఒకడుగు ముందుకేసి భవిష్యత్ సాంకేతికతలను, సామర్థ్యతలను సంతరించుకుంటున్నదని వివరించారు. వారు ఎప్పుడూ భారత భౌగోళిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి సదా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఆర్మీని ఆధునీకరించే ప్రక్రియలో భారత ప్రభుత్వం గత రెండేళ్లుగా ఎన్నో అధునాతన ఆయుధాలను దేశ అమ్ములో పొదిలో ప్రవేశపెడుతున్నది. తద్వారా ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా ఆర్మీ సులభంగా విధులు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. గన్నులు మొదలు, వైమానిక దళ ఆయుధ సంపత్తి వరకు ఇటు పాకిస్తాన్‌తో బార్డర్ ఎల్‌వోసీ దగ్గర, చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ఎల్‌ఏసీ దగ్గర నిర్వహణ సామర్థ్యాలను పెంచింది. 

మోడీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా మేక్ ఇన్ ఇండియా విధానం కింద ఎన్నో విధానాలకు శ్రీకారం చుట్టి దేశీయంగానే దేశానికి కావాల్సిన ఆయుధ సంపత్తిని తయారు చేయడానికి అడుగులు వేస్తున్నది. ఇందుకోసం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తద్వారా భారత ఆయుధ సంపత్తి కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నది.

మేక్ ఇన్ ఇండియా (Make In India) నినాదాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కేంద్రం తాజా బడ్జెట్‌లో నిర్ణయించింది. రక్షణ రంగానికి(Defence Sector) చెందిన కొనుగోళ్లు పెద్దస్థాయిలో దేశీయంగానే చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తద్వార ప్రైవేటు రంగానికీ సముచిత ప్రాధాన్యతను ఇచ్చారు. భారత రక్షణ శాఖకు కావాల్సిన ఆయుధాలు, పరికరాల్లో 68 శాతం భారత్‌లోనే తయారు చేసే ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గత బడ్జెట్ కంటే కూడా ఈ శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతేడాది రక్షణ రంగంలోకి ప్రైవేటు రంగం నుంచి 58 శాతం కొనుగోళ్లు జరపాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.