భారత దేశ కరెన్సీ దారుణంగా పతనం అయిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అంగీకరించింది. 2014 నుంచి ఇప్పటి వరకు రూపాయి విలువ 25 శాతం పడిపోయిందని వివరించింది. 2014లో ఒక అమెరికన్ డాలర్‌కు సమానంగా రూ. 63.33 ఉండగా.. ఈ ఏడాది జులై 11వ తేదీ నాటికి రూ. 79.41కి పడిపోయిందని తెలిపింది. 

న్యూఢిల్లీ: భారత దేశ కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పతనమైన సంగతి తెలిసిందే. ఇటీవలే డాలర్‌‌పై ఈ రూపాయి విలువ 80 రూపాయలకు పడిపోయింది. ఈ స్థాయి పతనం రూపాయి చూడలేదు. విపక్షాలు రూపాయి పతనంపై విమర్శలు సంధించాయి. తాజాగా, కేంద్ర ప్రభుత్వం కూడా రూపాయి పతనం వాస్తవమేనని అంగీకరించింది. 2014 నుంచి పరిశీలిస్తే.. ఇప్పటి వరకు రూపాయి విలువ 25 శాతం పడిపోయిందని వివరించింది.

గడిచిన 8 సంవత్సరాల్లో భారత రూపాయి విలువ 16.08 రూపాయలు పడిపోయిందని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటులో వెల్లడించింది. ఇది 25.39 శాతం క్షీణతకు సమానం. కేంద్ర ఆర్థిక శాఖ ఈ విషయాన్ని పార్లమెంటుకు తెలిపింది. ఆర్బీఐ లెక్కల ప్రకారం, 2014లో ఎక్స్‌చేంజ్ రేటు ఒక అమెరికన్ డాలర్‌కు రూ. 63.33లుగా ఉన్నదని వివరించింది. 2022 జులై 11వ తేదీ నాటికి ఈ విలువ రూ. 79.41కు పడిపోయిందని తెలిపింది.

2014 డిసెంబర్ 31వ తేదీన ఈ ఎక్స్‌చేంజ్ రేట్ ఒక డాలర్‌కు రూ. 63.33గా ఉన్నదని తెలిపింది. అదే 2018 డిసెంబర్ 31వ తేదీకి ఈ విలువ 69.79కి పడిపోయిందని వివరించింది. 2019 డిసెంబర్ 31న ఒక డాలర్‌కు 70 రూపాయల మార్క్ దాటి పడిపోయిందని తెలిపింది. కరోనా మహమ్మారి తర్వాత ఈ ఎక్స్‌చేంజ్ రేట్ 70 రూపాయల్లో ఆగిందని వివరించింది.

భారత కరెన్సీ పతనం గురించి వివరాలు వెల్లడించాలని లోక్‌సభ ఎంపీలు దీపక్ బైజ్, విజయ్ వసంత్‌లు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా భారత ప్రభుత్వం... జూన్ 30వ తేదీన ఒక డాలర్‌‌కు సమానంగా రూ. 78.94గా ఉన్నదని వివరించింది.

అంతర్జాతీయ అంశాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, క్రూడాయిల్ ధరలు చుక్కలను చేరడం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఆంక్షల్లో కూరుకుపోవడం వంటివి రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. అంతేకాదు, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు భారత ఈక్విటీ నుంచి సుమారు 14 బిలియన్ డాలర్లు వెనక్కి తీసుకున్నారని వివరించారు.

అంతేకాదు, అంతర్జాతీయంగా కేవలం భారత రూపాయి మాత్రమే ఇతర దేశాల కరెన్సీ విలువలు కూడా అమెరికా డాలర్‌తో పోల్చితే పడిపోయాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. బ్రిటీష్ పౌండ్, జపాన్ యెన్, యూరోలు కూడా భారీగా పతనం అయ్యాయని తెలిపారు. ఇవి భారత రూపాయి కంటే కూడా ఎక్కువగా క్షీణించాయని పేర్కొన్నారు.