డిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు వివిధ రకాల ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ వర్షపునీరు తమ ఆవాసాల్లో చేరుకోవడంతో ఓ భారీ కొండచిలువ మానవ ఆవాసాల్లోకి చొరబడింది.  ఇలా ఓ ఇంట్లోకి చేరుకున్న ఐదడుగుల కొండచిలువను ఎలాంటి ప్రమాదం జరగకముందే గుర్తించారు. ఈ ఘటన న్యూడిల్లీలోని ఓక్లహాలో చోటుచేసుకుంది. 

తమ ఇంట్లో భారీ కొండచిలువ వుందంటూ ఓ కుటుంబం పాములను పట్టే ఓ ఎన్జీవోకు ఫోన్ చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్ సైతం కొండచిలువను చూసి ఆశ్చర్యపోయాడు. ఐదడుగుల పొడవు కలిగిన ఈ భారీ కొండచిలువను పట్టుకున్నారు. అయితే ప్రస్తుతం అనారోగ్యంతో వుందని... కొన్నిరోజులు తమ పరిశీలనలో వుంచుకుని వైద్యం అందించిన తర్వాత అడవిలో వదిలిపెడతామని సదరు ఎన్జీవో సంస్థ వెల్లడించింది. 

వర్షాకాలంలో కురిసే వర్షాలతో తమ ఆవాసాల్లో నీరు చేరుకోవడంతో పొడి ప్రదేశాల్లోకి వెళ్లడానికి పాములు ప్రయత్నిస్తాయని... ఈ క్రమంలోనే అప్పుడప్పుడు జనావాసాల్లోకి  కూడా వస్తుంటాయని ఎన్జీవో సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇలాగే ఈ కొండచిలువ కూడా వచ్చి వుంటుందని అన్నారు. కాబట్టి ప్రజలు తమ   జాగ్రత్తల్లో వుండాలని ఈ సంస్థ సూచించింది.