కోట్లాది మంది ప్రజలను ప్రతినిత్యం గమ్యస్థానాలకు చేరుస్తున్న భారతీయ రైల్వేలు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పర్యాటక ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెండు రైళ్లను నడిపే బాధ్యతను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించేందుకు రైల్వో బోర్డు బిడ్లను ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది.

అలాగే ఐఆర్‌సీటీసీకి రెండు రైళ్లను నడిపే బాధ్యతను ప్రయోగాత్మకంగా అప్పగించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టికెట్ల జారీ నుంచి రైళ్లను నడిపే బాధ్యతను రైల్వే బోర్డు ఐఆర్‌సీటీసీకి అప్పగించనుంది.

ఈ రైళ్లను లీజుకు ఇవ్వడం ద్వారా లీజు ఛార్జీలను వసూలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని ప్రధాన నగరాలను కలిపేలా రెండు రైళ్లను నడిపేందుకు ప్రైవేట్ ఆపరేటర్లను నియమించేందుకు రైల్వే బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది.

ఈ మేరకు రైల్వేబోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో రైల్వే యూనియన్లను సంప్రదించి తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా నిర్ణయించారు. ఈ ఏడాది జనవరిలో ప్యాసింజర్ సేవలు, టికెట్ ధరలను నిర్ణయించే అంశాల్లో ప్రైవేట్ వ్యక్తుల్ని భాగస్వాముల్ని చేయడంపై రైల్వేబోర్డు దృష్టి సారించింది.

ప్రపంచవ్యాప్తంగా రైల్వేల నిర్వాహణలో పలు మార్పులు వచ్చినందున.. భారత్‌లోనూ ఈ దిశగా సంస్కరణల్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని బోర్డు సభ్యుడు గిరీశ్ పిళ్లై తెలిపారు. రైల్వేలను ప్రైవేటీకరణను అనుమతించే విషయంలో ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.