దేశంలో బొగ్గు కొరత(coal crisis) ప్రభావం కేవలం కరెంట్‌(power crisis)పైనే కాదు.. ప్యాసింజర్ ట్రైన్ల పైనా పడింది. బొగ్గును ఎక్కువ మొత్తంలో వేగంగా సరఫరా చేయడానికి రైల్వే శాఖ ప్యాసింజర్ ట్రైన్లను రద్దు చేసింది. ఇప్పటి వరకు 240 ట్రైన్లను రద్దు చేసినట్టు తెలిసింది. అంతేకాదు, వచ్చే నె 24వ తేదీ వరకు మొత్తం 670 ట్రైన్ ట్రిప్పులను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. 

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలు బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని గంటల వరకే కొన్ని ప్లాంట్‌లలో బొగ్గు నిల్వలు ఉన్నాయని చట్టసభ్యులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో ఈ సంక్షోభం తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తున్నది. వీటితోపాటు రాజస్తాన్, కేరళ, బిహార్, హర్యానా సహా మరికొన్ని రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభం అంచున ఉన్నట్టు సమాచారం. వేసవి కాలం కావడం, విద్యుత్ వినియోగం పెరగడానికి తోడు థర్మల్ పవర్ స్టేషన్‌లలో బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ఏర్పడుతున్నది. ఇప్పటికే ఢిల్లీ, రాజస్తాన్ వంటి రాష్ట్రాల మంత్రులు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. వెంటనే బొగ్గును అందించాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ నేపథ్యంలోనే బొగ్గు గనుల నుంచి పవర్ స్టేషన్‌లకు కోల్ సరఫరా వేగాన్ని పెంచడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా బొగ్గును రైల్వే ద్వారా సరఫరా చేస్తుంటుంది. ఈ బొగ్గు సరఫరాను పెంచడానికి అంటే.. కోల్ రేక్‌లను పెంచి ఎక్కువ మొత్తంలో సరఫరా చేయడానికి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్ ట్రైన్లను రద్దు చేస్తూ ట్రాక్‌లను ఎక్కువగా ఈ రేక్‌ల సరఫరాకు కేటాయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 240 ప్యాసింజర్ ట్రైన్‌లను రద్దు చేసినట్టు సమాచారం అందింది. తద్వారా దేశవ్యాప్తంగా 400 కోల్ రేక్‌లను సరఫరా చేయడానికి సిద్ధపడినట్టు తెలిసింది. గతేడాది రైల్వే శాఖ 347 కోల్ రేక్‌లను బొగ్గు సరఫరాకు వినియోగించేది. ఈ ఏడాది 400 కోల్ రేక్‌లను ఇందుకు వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ స్థాయిలో బొగ్గు వినియోగం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి.

భారత రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ప్యాసింజర్ ట్రైన్‌లను మరిన్ని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం అవుతున్నది. వచ్చే నెల అంటే మే 24వ తేదీ వరకు 670 రైళ్ల ట్రిప్పులను రద్దు చేయాలని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇందులో 500 రైల్వే ట్రిప్పులు సుదూరం వెళ్లే మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ల రూట్లూ ఉన్నాయి.