గత మూడేళ్లలో భారతీయ ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు) మొత్తం రూ. 55,449 కోట్ల విదేశీ నిధులను అందుకున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా ఆయన ఈ సమాచారాన్ని అందించారు.
భారతీయ ప్రభుత్వేతర సంస్థలకు(ఎన్జీవోలు) విదేశాల నుంచి భారీ మొత్తంలో విరాళాలు వచ్చిపడుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం ప్రభుత్వమే ప్రకటించింది. గత మూడేళ్లలో భారతీయ ఎన్జీవోల ద్వారా మొత్తం ₹ 55,449 కోట్ల విదేశీ నిధులు అందాయని గురువారం రాజ్యసభకు తెలియజేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎన్జీవోలకు ₹ 16,306.04 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ₹ 17,058.64 కోట్లు, 2021-2222లో ₹ 22,085.10 కోట్లు అందాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు .
రాష్ట్రాల పరంగా పరిశీలిస్తే.. ఢిల్లీలో ఉన్న NGOలు అత్యధికంగా ₹ 13,957.84 కోట్ల విదేశీ నిధులను పొందగా, తమిళనాడు - ₹ 6,803.72 కోట్లు, కర్ణాటక - ₹ 7,224.89 కోట్లు మరియు మహారాష్ట్ర - ₹ 5,555.37 కోట్ల రూపాయాలు విరాళంగా వచ్చాయి. విదేశీ నిధులను పొందిన NGOలు ఫారిన్ కంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (FCRA) కింద నమోదు చేయబడ్డాయి.
మార్చి 10, 2023 నాటికి, 16,383 NGOల FCRA రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుందని, వీటిలో 14,966 NGOలు ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్, 2010 ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి తప్పనిసరిగా వార్షిక రిటర్న్‌లను సమర్పించాయని మంత్రి తెలిపారు. ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్టర్డ్ అసోసియేషన్‌ల ద్వారా విదేశీ విరాళాలను దుర్వినియోగం చేయడం లేదా మళ్లించడంపై గతంలో కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, అలాంటి ఫిర్యాదులను చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.
