President Fleet Review 2022:  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 12వ ఎడిషన్ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ  ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ అద్భుత ఘ‌ట్టానికి  విశాఖ సాగర తీరం వేదికైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఐఎన్ఎస్ సుమిత్రను అధిరోహించి.. నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షించారు. ఈ సందర్భంగా నేవీ యుద్ద విమానాలు నిర్వ‌హించిన విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి.  

President Fleet Review 2022: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విశాఖ సాగర తీరంలో 12వ ఎడిషన్ ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఐఎన్ఎస్ (INS) సుమిత్రను అధిరోహించి.. నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షించారు. ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ భాగంగా.. భారత నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలు విన్యాసాలు చేస్తూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కు గౌరవ వందనం సమర్పించాయి. 

60 యుద్ధనౌకలతోపాటు సబ్ మెరైన్స్‌, హెలికాప్టర్లు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి. దీనిలో భాగంగా భారత నౌకాదళ శక్తి సామార్థ్యాలను రాష్ట్రపత్రి రామ్‌నాథ్ సమీక్షిస్తున్నారు. ఫ్లీట్ రివ్యూ సందర్భంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో రాష్ట్రపతి 21-గన్-సెల్యూట్ అందుకున్నారు. అంతకుముందు నేవల్ డాక్‌యార్డ్‌కు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్ అందించారు.

 నావీ యుద్ధనౌకలతో పాటు, ఇండియన్ కోస్ట్ గార్డ్, SCI, MoES యుద్ద‌ నౌకలు సమీక్షలో పాల్గొన్నాయి. పరేడ్ ఆఫ్ సెయిల్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ డెమోన్‌స్ట్రేషన్ ఎట్ సీ, హాక్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఏరోబాటిక్స్, ఎలైట్ మెరైన్ కమాండోస్ (మార్కోస్) వాటర్ పారా జంప్‌లు అనేకం ఆకర్షణీయమైన వాటర్‌ఫ్రంట్ కార్యకలాపాలు అతిథులను మంత్రముగ్ధులను చేశాయి. చేతక్స్, ALH, సీ కింగ్స్, KAMOVలు, డోర్నియర్స్, IL-38SD, P8I, హాక్స్, MiG 29Kతో సహా 55 విమానాల విన్యాసాల‌ను రాష్ట్రపతి తిల‌కించారు. 

 ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా నౌకాదళాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ.. భారత నావికాదళం నిరంతర నిఘా, సంఘటనలపై సత్వర ప్రతిస్పందన, అవిశ్రాంతమైన ప్రయత్నాలు సముద్రాల భద్రతను కాపాడుకోవడంలో అత్యంత విజయవంతమైందని చెప్పారు. వాణిజ్యం, శక్తికి కీలకమైన సముద్రాలు, సముద్ర సామాన్యుల భద్రతను నిర్ధారించడంలో విజయవంతమయ్యాయని అన్నారు. భారత నావికాదళం మరింతగా స్వావలంబనగా మారుతోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవలో ముందంజలో ఉందని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.

 దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ షిప్‌యార్డ్‌లలో నిర్మాణంలో ఉన్న అనేక యుద్ధనౌకలు, జలాంతర్గాములలోని 70 శాతం విషయాలు స్వదేశీవి అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగం హిందూ మహాసముద్ర ప్రాంతంలోనే జరుగుతోందని మన వాణిజ్యం, ఇంధన అవసరాలలో గణనీయమై భాగం మహాసముద్రాల ద్వారానే తీరుతుందని కోవింద్‌ స్పష్టం చేశారు.

భారతదేశం అణు జలాంతర్గాములను నిర్మించడం గర్వించదగ్గ విషయమని, త్వరలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ‘విక్రాంత్’ అనే విమాన వాహక నౌకను కూడా నౌక‌ద‌ళంలో చేర్చుకుంటామని అన్నారు. స్వదేశీ నౌకాదళ షిప్‌బిల్డింగ్ సామర్థ్యాల అభివృద్ధి 'ఆత్మనిర్భర్ భారత్' తయారీకి అద్భుతమైన సహకారం అని అన్నారు. అంతేగాక 1971 యుద్ధ సమయంలో విశాఖపట్నం నగరం అద్భుతమైన సహకారం అందించిందని చెప్పారు.

క‌రోనా సమయంలో నేవీ పాత్రను ప్రశంసించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్నేహపూర్వక దేశాలకు వైద్య సహాయం అందించారని అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విదేశీ పౌరులను తరలించార‌ని తెలిపారు. సమీక్ష తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ్ చౌహాన్ లు ప్రత్యేక స్మారక స్టాంపును విడుదల చేశారు.