నియంత్రణ రేఖ వెంబడి అలజడికి పాకిస్తాన్ కుట్ర పన్నినట్లు తెలియడంతో కాశ్మీర్ సరిహద్దుల వెంబడి అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.

పాకిస్తాన్ సైన్యం, జమాత్ ఉల్ అల్ హదీప్ సంస్థ సంయుక్తంగా 4 వేల మంది యువకులకు శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. శిక్షణ పొందిన వారంతా ఎల్వోసి దాటి భారత్‌లో చొరబాటుకు ప్రయత్నించే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరించాయి.

వీరితో పాటు మరికొందరు యువకులకు రావల్పిండిలోని సైనిక స్థావరంలో 4 వారాల పాటు శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరు సరిహద్దులు దాటేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు సహకరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

అయితే పాక్ ఎటువంటి దాడులకు పాల్పడినా వాటిని తిప్పికొడతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే భారత భూభాగంపై ఏ మాత్రం అలజడి రేగినా బాలాకోట్ లాంటి ఘటనలు పునరావృతమవుతాయని భారత సైన్యం పాక్‌ను హెచ్చరించింది.