Asianet News TeluguAsianet News Telugu

యూకేలో ఆలయాలపై దాడులను ఖండించిన భారత్.. ‘తక్షణమే చర్యలు తీసుకోండి’

యూకేలో హిందు, ముస్లింల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. యూకేలో ఆలయాలపై దాడులను భారత హై కమిషన్ నిరసించింది. వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరింది. ఈ దాడులతో ప్రభావితమైన వారికి రక్షణ కల్పించాలని సూచించినట్టు ఓ ట్వీట్‌లో తెలిపింది.
 

indian high commission condemns attacks on temple in UKs leicester
Author
First Published Sep 19, 2022, 8:34 PM IST

న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లీసెస్టర్‌లో హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. ఓ ఆలయం ఎదుటి కాషాయ జెండాను దుండగులు తొలగించారు. ఇలాంటి ఘటనలపై లండన్‌లోని భారత హై కమిషన్ రియాక్ట్ అయింది. ఈ దాడులను ఖండించింది. తక్షణమే దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ఈ దాడులను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, యూకే అధికారులతో ఈ విషయంపై మాట్లాడామని, తక్షణమే యాక్షన్ తీసుకోవాలని పేర్కొన్నట్టు ఇండియన్ హై కమిషన్ ఓ ట్వీట్‌లో తెలిపింది. ఈ దాడులతో ప్రభావితమైన వారికి రక్షణ కల్పించాలని అధికారులను కోరినట్టు వివరించింది.

ఇప్పటి వరకు ఈ హింసకు సంబంధించి యూకే పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. మెల్టన్ రోడ్డు సమీపంలోని ఓ జెండాను తొలగించడాన్ని తాము విచారిస్తున్నామని ఓ ప్రకటనలో వివరించారు. ముస్లిం యువకులు గుమిగూడి ఆందోళనలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి. అలాగే, జై శ్రీరామ్ అని నినాదాలు ఇస్తున్న హిందూ గ్రూపుల వీడియోలు చక్కర్లు కొట్టాయి. వీరే లీసెస్టర్‌లోని ముస్లింల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఎదుటి వర్గం వారు ఆరోపణలు చేశారు.

దుబాయ్‌లో ఆగస్టు 28న ఇండియా పాకిస్తాన్ క్రికెట్ల జట్ల మధ్య ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్ తర్వాత ఈ సిటీలో హిందూ, ముస్లిం గ్రూపుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతున్నాయి.

తూర్పు లీసెస్టర్ ఏరియాలో తమ ఆపరేషన్ కొనసాగుతున్నదని యూకే పోలీసులు తెలిపారు. మళ్లీ ఘర్షణలకు సంబంధించిన రిపోర్టులు మాత్రం రాలేవని వివరించారు. ఈ ఏరియాలో పోలీసు ఆపరేషన్లు కఠినంగా అమల్లో ఉన్నట్టు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios