పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడితో పాక్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆరోపణలు చేయడం కాదు ఆధారాలు చూపాలంటూ ఆయన బదులివ్వడం భారత ప్రభుత్వ వర్గాలకు ఆగ్రహం తెప్పించింది.

ఈ మేరకు విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ఘాటుగా సమాధానం చెప్పారు. ‘‘పాకిస్తాన్ ప్రధాని ఇటువంటి ప్రకటన చేయడంలో ఆశ్చర్యం లేదు.. పుల్వామా ఉగ్రదాడిని ఆయన ఖండించలేదు... అలాగే వీర జవాన్ల మృతికి ఆయన సంతాపం కూడా తెలపలేదు.

ఉగ్రవాదంపై...భారత్‌తో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. అయితే ఉగ్రవాదం, హింసాయుత వాతావరణం లేకపోతే ద్వైపాక్షిక చర్చలు జరపడానికి సిద్ధమని భారత్ ఇప్పటికే పలుసార్లు తెలిపిందని రవీశ్ కుమార్ స్పష్టం చేశారు.

ఉగ్రవాదానికి తామే బాధితులమని ఇమ్రాన్ అంటున్నారు.. కానీ ఉగ్రవాదం ఆ దేశంలో భాగమని ప్రపంచం మొత్తానికి తెలుసునన ఎద్దేవా చేశారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడి విషయంలో చర్యలు తీసుకుంటామని చెప్పిందని, హఫీజ్ సయిద్ వంటి ఉగ్రవాదులతో పాక్ కొత్త ప్రధాని వేదికను పంచుకుంటున్నారని రవీశ్ కుమార్ మండిపడ్డారు.

పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన ఆధారాలు సమర్పిస్తే విచారణ జరుపుతామని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారని... మరి 26/11 దాడికి సంబంధించిన ఆధారాలను ఇస్తే పాకిస్తాన్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.

పుల్వామా దాడికి తామే బాధ్యులమని స్వయంగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిందని.... ఆ సంస్థ ప్రధాన కార్యాయలం, దాని నాయకుడు మసూద్ అజహర్ పాకిస్తాన్‌కు చెందిన వారేనని అందరికి తెలుసునన్నారు. ఇవే పుల్వామా దాడిలో ఆధారాలని రవీశ్ వెల్లడించారు.