సముద్రం అడుగున జాతీయ పతాకావిష్కరణ .. దేశభక్తిని చాటుకున్న ఇండియన్ కోస్ట్‌గార్డ్ (వీడియో)
ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది మాత్రం తమ దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. ఏకంగా సముద్ర గర్భంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దీంతో ఇండియన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది ధైర్య సాహసాలు, దేశభక్తిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వూరు వాడా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రజలు .. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది మాత్రం తమ దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. సముద్ర గర్భంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఇది జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఇండియన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రం అడుగున నిలబడి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఏడు సెకన్ల నిడివి గల ఈ వీడియో సముద్రపు అడుగు భాగానికి నలుగురు కోస్ట్‌గార్డ్ సిబ్బంది చేరుకుంటారు. వీరిలో ఒకరు జాతీయ జెండాను ఎగురవేయగా, మిగిలిన వారు మువ్వన్నెల జెండాకు వందనం చేస్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇండియన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది ధైర్య సాహసాలు, దేశభక్తిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అంతకుముందు చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన 1800 మంది ప్రముఖులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. అలాగే ఈ స్వాతంత్య్ర దినోత్సవంతో ‘‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ’’ వేడుకలు ముగిశాయి. 2021 మార్చి 12న గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రధాని ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.