ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణను అధిరోహించి తిరిగి వస్తుండగా అదృశ్యమైన భారతదేశానికి పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్ జాడను సహాయక బృందాలు గుర్తించాయి.
కనిపించకుండాపోయిన భారతదేశానికి చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్ జాడను ఎట్టకేలకు సహాయక బృందాలు కనుగొన్నాయి. నేపాల్‌లో వున్న అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించి .. తిరిగి కిందకు వస్తుండగా ఆక్సిజన్ కొరత తలెత్తి ఆమె కనిపించకుండాపోయారు. బల్జీత్‌తో పాటు మరో ఇద్దరు సైతం తప్పిపోయారు. కాగా.. ఎనిమిదివేల మీటర్లకు పైగా ఎత్తయిన నాలుగు పర్వతాలను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా బల్జీత్ కౌర్ రికార్డుల్లోకెక్కారు. దీనితో పాటు మరెన్నో రికార్డులు ఆమె పేరిట వున్నాయి.
పర్వతాలను అధిరోహించే క్రమంలో పలుమార్లు ఆక్సిజన్ కొరతతో ఆమె ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2016లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు బల్జీత్ ప్రయత్నించారు. అయితే అది విఫలమైంది . అదనపు ఆక్సిజన్ మాస్క్ లేకపోవడంతో శిఖరాగ్రానికి 300 మీటర్ల దూరంలో వుండగా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈసారి ఎవరెస్ట్‌ను అధిరోహిస్తానని బల్జీత్ స్పష్టం చేశారు.
బల్జీత్ కౌర్ హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలోని మామ్లిగ్ ప్రాంతానికి చెందినవారు. బల్జీత్ కౌర్ ప్రాణాలతో బయటపడినట్లుగా .. ఆమెను ఏరియల్ సెర్చ్ టీమ్ గుర్తించినట్లుగా పయనీర్ అడ్వెంచర్ ప్రెసిడెంట్ పసాంగ్ షెర్పా తెలిపారు. అన్నపూర్ణ క్యాంప్ 4 వైపు ఆమె దిగుతూ కనిపించినట్లుగా ఆయన వెల్లడించారు. తనకు తక్షణం సహాయం కావాలంటూ రేడియో సిగ్నల్స్ పంపడం.. ఆ వెంటనే మూడు హెలికాఫ్టర్లతో కూడిన ఏరియల్ సెర్చ్ టీమ్ రంగంలోకి దిగడంతో బల్జీత్ ఆచూకీ తెలిసింది. సోమవారం సాయత్రం 5.15 గంటల సమయంలో ఇద్దరు షెర్పా గైడ్‌లతో కలిసి బల్జీత్ అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించారు.
అయితే సోమవారం .. రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌కు చెందిన అనురాగ్ మాలు అనే పర్వతారోహకుడు సైతం అన్నపూర్ణ పర్వతం క్యాంప్ 3 నుంచి దిగుతూ అదృశ్యమయ్యాడు. అయితే ఆయన పర్వతం 6000 మీటర్ల వద్ద వున్న పగుళ్ల మధ్యలో పడి మరణించినట్లుగా ది హిమాలయన్ టైమ్స్ వార్తాపత్రిక నివేదించింది. అలాగే సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ వింటర్ సీజన్‌లో ఐర్లాండ్ నుంచి కే2 శిఖరాన్ని అధిరోహించిన నోయెల్ హన్నా.. సోమవారం రాత్రి క్యాంప్ 4లో తుదిశ్వాస విడిచారు. వీరిద్దరి మృతదేహాలను బేస్ క్యాంప్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అన్నపూర్ణ.. ప్రపంచంలోని పదవ ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో వుంది.
