కరోనా తర్వాత ప్రపంచం మొత్తం చైనా అంటే అసహ్యించుకుంటోంది. ఇదే సమయంలో చైనీయులపైనా అక్కడక్కడా దాడులు జరగడం, వారిపై వివక్ష చూపుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇది భారతదేశంలో సైతం కనిపిస్తోంది.

మనదేశంలో కోల్‌కతా నగరంలో చైనీయులు అత్యధిక సంఖ్యలో స్థిరపడ్డారు. ఇక్కడి చైనా టౌన్‌లో ఐదు వేల మంది చైనా మూలాలు కలిగిన వారు నివసిస్తున్నారు. అయితే కరోనా తర్వాత వీరిని స్థానికులు కరోనా... కరోనా అంటూ సూటిపోటి మాటలంటూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.

దాదాపు ఏడు దశాబ్ధాల క్రితం కోల్‌కతాకు వచ్చి స్థిరపడిన వీరు అప్పటి నుంచి ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ఎప్పుడైతే కరోనా, గల్వాన్ ఘటనలు సంభవించాయో అప్పుడు పరిస్ధితి తలక్రిందులైపోయింది.

గాల్వన్ లోయలో 20 మంది సైనికులు వీర మరణం పొందడంతో చైనా టౌన్ వాసులు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే వణికిపోయారు. ఈ ఘటనలపై ఇక్కడి వారు స్పందిస్తూ.. తాము ఇక్కడే పుట్టాం.. ఇక్కడే పెరిగామన్నారు.

కానీ కొందరు చదువుకోని, చరిత్ర తెలియని మూర్ఖులు మమ్మల్ని అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను భారతదేశం నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోవాలంటూ వీధుల్లో కేకలు పెడుతున్నారని తెలిపారు.

తమకు భారతీయులతో ఎనలేని అనుబంధం వుందని, తమను దయచేసి వేరుగా చూడొద్దని ఓ వ్యక్తి ఉద్వేగంగా చెప్పాడు. మా ముఖాలు చైనీయుల్లా కనిపిస్తున్నా మేం కూడా భారతీయులమేనని వారు తేల్చి చెప్పారు.

ఇకపోతే చైనా టౌన్‌లో తయారవుతున్న చాలా వస్తువులకు చైనా నుంచి  వచ్చే ముడిసరుకే దిక్కు. అక్కడి నుంచి వందల సంఖ్యలో కన్‌సైన్‌మెంట్లు వస్తున్నాయి. కానీ, వీటిని అధికారులు అడ్డుకుంటున్నారని భారతీయ చైనీయులు ఆరోపిస్తున్నారు.

బాయ్ కాట్ చైనాలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఇక్కడి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ చైనా కార్గోలను కావాలని ఆపలేదని పరిమిత సంఖ్యలో విధులు నిర్వహిస్తున్నందున కొంచెం ఆలస్యమవుతుందని వెల్లడించారు.