సాయుధ దళాల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అగ్నిపథ్‌కు శ్రీకారం చుట్టిన సంగతి  తెలిసిందే. దీని కిందే అగ్నివీరుల ఎంపిక జరుగుతుంది. అయితే తాజాగా ఇండియన్ ఆర్మీ.. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా వెబ్ ఆధారిత అప్లికేషన్‌ను అభివృద్ది చేసింది.

న్యూఢిల్లీ: సాయుధ దళాల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అగ్నిపథ్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీని కిందే అగ్నివీరుల ఎంపిక జరుగుతుంది. అయితే తాజాగా ఇండియన్ ఆర్మీ.. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా వెబ్ ఆధారిత అప్లికేషన్‌ను అభివృద్ది చేసింది. అగ్నిపథ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్‌వర్కింగ్ కోసం ఆర్మీ సాఫ్ట్‌వేర్ (ASAAN-ఆసాన్) పేరుతో అభివృద్ది చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌లో అగ్నివీర్స్ మొత్తం డేట బేస్ రికార్డు చేయడంతో పాటు, నిర్వహించడం జరుగుతుంది. దీనిని ఇండియన్ ఆర్మీ అంతర్గతంగా అభివృద్ది చేసింది. ఇది ఆర్మీ డేటా నెట్‌వర్క్‌లో హోస్ట్ చేయబడింది. అగ్నివీరులు సేవ నుంచి నిష్క్రమించిన తర్వాత ఏజెన్సీలకు అవసరమైన డేటా ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. 

‘‘ఈ ఏడాది జనవరిలో సేవలో చేరిన ప్రతి అగ్నివీరుని డేటా ఈ అప్లికేషన్ ద్వారా నిర్వహించబడుతోంది’’ అని భారత సైన్యంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇండియన్ ఆర్మీకి చెందిన 19,000 మంది అగ్నివీరుల మొదటి బ్యాచ్ దేశవ్యాప్తంగా దాదాపు 40 కేంద్రాలలో ప్రత్యేకంగా క్యూరేటెడ్ కోర్సులలో శిక్షణ పొందుతోంది. ఇక, 40,000 మంది అగ్నివీరులను ఎంపిక చేసేందుకు ఆర్మీ దేశవ్యాప్తంగా మొత్తం 96 రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించింది. రెండో బ్యాచ్‌లో 21,000 మందికి పైగా రిక్రూట్ కాగా.. మార్చి 1 నుంచి శిక్షణను ప్రారంభించింది.

వెబ్ ఆధారిత అప్లికేషన్‌లో రిక్రూట్‌మెంట్, రికార్డు కార్యాలయాలు, శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, హెచ్‌ఆర్‌డీసీ కోసం మాడ్యూల్స్ ఉన్నాయి. అగ్నివీర్స్‌కు సంబంధించిన అవసరమైన డేటాను డేటాబేస్‌లో నింపేందుకు ఈ ఏజెన్సీలు ప్రతి ఒక్కదానిని అనుమతిస్తుంది అని ఆ అధికారి తెలిపారు. 

ఈ అప్లికేషన్‌తో అసెస్‌మెంట్, స్క్రీనింగ్‌తో సహా అన్ని రకాల డాక్యుమెంటేషన్‌ల కోసం హ్యుమన్ ఇంటర్‌ఫియరెన్స్ అవసరం ఉంటుంది. నాలుగు సంవత్సరాల తర్వాత అగ్నివీర్స్ సేవను విడిచిపెట్టినప్పుడు.. వారి డేటాను ఏజెన్సీలకు అందుబాటులో ఉంచవచ్చు.