రెండవ పర్యాయం అధికారం చేపట్టి నేటికి మోడీ సర్కారు సంవత్సరం పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా సంవత్సర పాలనపై దేశప్రజలందరికి ప్రధాని నరేంద్రమోడీ బహిరంగలేఖను రాసారు. 

చారిత్రాత్మక నిర్ణయాల ద్వారా దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్న తరుణంలో  అకస్మాత్తుగా విరుచుకుపడ్డ ఈ కరోనా వైరస్ వల్ల వలస కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని ప్రధాని మోడీ తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరులో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన విధంగానే ఆర్ధిక  పురోగతిని సాధించి కూడా ప్రపంచాన్ని భారత్ ఆశ్చర్యపరచడం తథ్యం అని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 

గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలని,  మరో దఫా కొనసాగించాలనే ఉద్దేశంతో మాత్రమే ప్రజలు ఓటు వేయలేదని, భారత దేశాన్ని సమున్నతంగా చూడాలన్న కల సాకరం చేసుకోవడానికే ఓటు వేశారని నరేంద్రమోడీ అన్నారు. 

రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే సువర్ణాధ్యాయం అని ఆయన అన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్, బాలాకోట్ వైమానిక దాడుల ద్వారా భారత్‌ తన శక్తి ఏమిటో మరోసారి ప్రపంచానికి చాటిందని ప్రధాని అన్నారు. 

అనేక సంస్కరణలను ప్రభుత్వం తీసుకొచ్చిందని, వన్‌ ర్యాంక్‌-వన్‌ పెన్షన్‌, వన్‌ నేషన్‌-వన్‌ ట్యాక్స్‌, రైతుల కోసం ఎం ఎస్ పి ని మరింత పెంచామని అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు దేశ సమైక్యత, సమగ్రతా స్ఫూర్తిని మరింతగా పెంచిందన్నారు. అయోధ్య రామ మందిరంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుతో శతాబ్దాలుగా వివాదాస్పదమైన విషయానికి సామరస్యపూర్వకమైన పరిష్కారం దొరికిందన్నారు ప్రధాని. 

అమానవీయ ట్రిపుల్‌ తలాక్‌ పద్దతికి చరమగీతం పాడేశామని,దాన్ని చెత్తబుట్టలోకి నెట్టేశామని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం భారత దేశ మానవీయతను, కలుపుగోలుతనాన్ని మరోసారి ఎలుగెత్తి చాటిందన్నారు మోడీ. 

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి రైతులందరికీఅందుతుందని.. ఏడాదిలోనే 9.5కోట్లమంది రైతుల ఖాతాలో 72వేల కోట్లును జమ చేశామని ఆయన లేఖలో తెలిపార. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా 15కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు పైపుల ద్వారా సురక్షితమైన త్రాగునీరును సరఫరా చేస్తున్నామని, దేశ చరిత్రలో తొలిసారిగా రైతులు, రైతు కూలీలు, చిన్న దుకాణదార్లు, అసంఘటిత కార్మికులు, 60 ఏళ్లపైబడ్డ వారికి రూ.3వేల చొప్పున పెన్షన్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు ప్రధాని నరేంద్రమోడీ. 

స్వయం సహాయక బృందాల్లోని 7కోట్లమంది మహిళలకు ఇచ్చే రుణాలను రెట్టింపు చేశామని, తద్వారా మహిళల అభ్యున్నతికి, సశక్తీకరణకు ఎంతగానో తాము కృషిచేశామన్నారు ప్రధాని.  

2014లో ప్రజలు మార్పును కోరుకొని ఓటు వేశారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిని దూరం చేసి.. పాలనను గాడిలో పెట్టామన్నారు  ప్రధాని నరేంద్రమోడీ. ‘అంత్యోదయ’ స్ఫూర్తికి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలు కూడా లక్షల మంది ప్రజల జీవితాల్లో  తీసుకొచ్చాయన్నారు ప్రధాని. 

ఆర్థికంగా అందరినీ శక్తివంతులుగా చేయడం, అందరిని కలుపుకుపోవడం అన్ని వెరసి 2014 నుంచి 2019 మధ్య దేశ ప్రతిష్ఠ గణనీయంగా పెరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తాజాగా ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ కింద ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ అత్యంత క్లిష్ట దశలో దేశ ఆర్థికప్రగతి కోసం వేసిన మరో ముందడుగన్నారు ప్రధాని. 

ఇక కరోనా వైరస్ సంక్షోభం పై స్పందిస్తూ.... కరోనాపై పోరు సలుపుతూనే ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టుకోవడం ద్వారా ప్రపంచాన్ని భారత్‌ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిందన్నారు. కరోనా మహమ్మారి వల్ల సంక్షోభ సమయం కొనసాగుతూనే ఉందని, దేశ ప్రజలంతా మరింత పట్టుదలతో, ధృడ నిశ్చయంతో ఈ సికారోనా పై పోరులో భాగస్వాములవ్వాలని, అచంచల విశ్వాసంతో వ్యవహరించాల్సిన సమయం కూడా ఇదేనని ప్రద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. 

కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్‌డౌన్‌ వల్ల వలస కార్మికులు, చేతి వృత్తుల పనివారు, హస్త కళాకారులు ఎన్నో కష్టాలు పడ్డారని.. ఆ సమస్య తీవ్రతను తగ్గించి ఆ పరిస్థితికి చరమగీతం పాడడానికి దేశ ప్రజలంతా ఐక్యంగా కలిసి ముందుకు సాగుతున్నారని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 

ఈ కరోనా పై పోరులో ప్రజలంతాకూడా ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం అందించారని, కరోనా పై పోరులో పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం చప్పట్లు కొట్టడం నుంచి దీపాలు వెలిగించడం వరకు, జనతా కర్ఫ్యూ నుంచి మొదలుకొని లాక్ డౌన్ నియమాలను పాటించడం వరకు ప్రజలంతా కూడా మద్దతుగా నిలిచారని ప్రధాని అన్నారు. ఒకటే లక్ష్యం కోసం పూర్తి భారతావని నిలబడిందని, శ్రేష్ట్ భారత్ కొరకు భారతావని అంతా కూడా ఏక్ భారత గా ఒక్కతాటిపై నిలబడ్డారని ప్రధాని ప్రజలను ప్రశంసించారు.