ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది అక్టోబర్‌లో గ్లోబల్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) 2023ని నిర్వహించనుంది. ఈ సదస్సులో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కృత్రిమ మేధస్సు నిపుణులు, పరిశోధకులు, స్టార్టప్‌లు,పెట్టుబడిదారులు పాల్గొననున్నారు.  

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఈ తరుణంలో ఈ ఏడాది అక్టోబర్‌లో గ్లోబల్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) 2023 తొలి ఎడిషన్ ను నిర్వహించనున్నట్టు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఓ అధికార ప్రకటన విడుదల చేసింది. ఈ సమ్మిట్ లో భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కృత్రిమ మేధస్సు కంపెనీలు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు,పెట్టుబడిదారులు పాల్గొంటారని తెలిపింది. 

ఈ సదస్సు స్టీరింగ్ కమిటీకి కేంద్ర నైపుణ్యాభివృద్ధి , వ్యవస్థాపకత, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అధ్యక్షత వహిస్తున్నారు . గ్లోబల్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2023 సమ్మిట్ విధివిధానాలను రూపొందించే పనిని కమిటీకి అప్పగించారు. గ్లోబల్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2023 కాన్ఫరెన్స్ అక్టోబర్ 14, 15 తేదీల్లో నిర్వహించాలని భావిస్తోన్నట్టు తెలుస్తోంది. ఈ సమ్మేళనంలో పాల్గొనే నిపుణులు కృత్రిమ మేధ/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రయోజనాలు, ప్రమాదాలు వంటి ముఖ్యమైన అంశాలపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఈ సమ్మిట్ గురించి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధ/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భవిష్యత్తు, వివిధ రంగాలలో దాని ప్రభావం గురించి చర్చించడానికి ప్రపంచంలోని నిపుణులు, ఒక్కే ఆలోచన గల వారందరూ ఒకే తాటిపైకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కృత్రిమ మేధ రంగంలో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ , మరెన్నో విషయాలను ప్రస్తావించారు.

 ఈ కాన్ఫరెన్స్‌లో కృత్రిమ మేధ/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంబంధించిన అంశాలపై సవివరమైన చర్చ జరుగుతోందని తెలిపారు. ఇందులో నెక్స్ట్ జనరేషన్ లెర్నింగ్, ఫౌండేషన్ AI మోడల్స్, నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో AI వాడకం, AI కంప్యూటింగ్ సిస్టమ్స్, ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలు వంటి అనేక అంశాలను ఈ సమావేశం చర్చించనున్నట్టు తెలిపారు.

ఈ కాన్ఫరెన్స్‌లో AIపై భారతదేశ దృక్పథాన్ని చర్చించడానికి AI నిపుణులందరినీ ఆహ్వానిస్తామని, వారు దేశంలో AI భవిష్యత్తు రోడ్ మ్యాప్ ను వివరిస్తారని అన్నారు. DI భాషిణి, ఇండియా డేటాసెట్స్ ప్రోగ్రామ్, India AI ఫ్యూచర్‌డిజైన్ ప్రోగ్రామ్ వంటి ప్రపంచ స్థాయి AI ప్రతిభను పెంపొందించడానికి అంకితమైన IndiaAI FutureSkills ప్రోగ్రామ్ వంటి కీలక కార్యక్రమాల సామార్ధ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి ఈ సమావేశం ఒక వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. AI ఇన్ గవర్నెన్స్, AI కంప్యూటింగ్ & సిస్టమ్స్, AI డేటా, AI ఐపీ అండ్ ఇన్నోవేషన్, AI స్కిల్స్ రాబోయే కాన్ఫరెన్స్ ఎజెండాలో అంతర్భాగంగా ఉంటాయని తెలిపారు.