సారాంశం

ఇండియా పేరును భారత్‌గా మారుస్తామని, కోల్‌కతాలో విదేశీయుల విగ్రహాలనూ మొత్తం తొలగిస్తామని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ అన్నారు. ఈ నిర్ణయం నచ్చని వారు దేశం విడిచి వెళ్లిపోవచ్చని కామెంట్ చేశారు.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్‌గా మారుస్తామని చెప్పారు. అంతేకాదు, కోల్‌కతాలోని విదేశీయుల విగ్రహాలన్నింటినీ తొలగించేస్తామని అన్నారు. ఖరగ్‌పూర్ సిటీలో దిలీప్ ఘోష్ చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆదివారం మాట్లాడారు.

చాయ్ పే చర్చ కార్యక్రమంలో మేదినీపూర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. ‘పశ్చిమ బెంగాల్‌లో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోల్‌కతాలో విదేశీయుల విగ్రహలు అన్నింటినీ తొలగిస్తాం.’ అని అన్నారు. ‘ఇండియా పేరును భారత్‌గా మార్చేస్తాం’ అని చెప్పారు. ఈ నిర్ణయాన్ని అంగీకరించనివారు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లవచ్చు అని పేర్కొన్నారు.

మరో బీజేపీ సీనియర్ నేత రాహుల్ సిన్హా మాట్లాడుతూ.. ఒక దేశానికి రెండు పేర్లు ఉండటం ఉచితం కాదని పేర్కొన్నారు. ఈ పేరును మార్చడానికి ఇదే సరైన సమయం అని వివరించారు. ఎందుకంటే ఢిల్లీలో జీ 20 శిఖరాగ్ర సదస్సుకు ప్రపంచ దేశాధినేతలు వస్తున్న సందర్భంలో ఈ పేరు మార్పు నిర్ణయం సరైందని తెలిపారు.

Also Read : G20 Summit: భారత్‌కు యూరప్‌ను మరింత చేరువ చేసే మధ్యాసియా ట్రేడ్ - టెక్ కారిడార్.. కీలక విషయాలు ఇవే

కాగా, తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి సాంతాను సేన్ బీజేపీపై విమర్శలు సంధించారు. బీజేపీ వాస్తవ సమస్యల నుంచి దృష్టి మళ్లించాలని ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఇండియా కూటమికి బీజేపీ భయపడుతున్నదని వివరించారు.