Asianet News TeluguAsianet News Telugu

G20 Summit 2023: ప్రధాని మోడీతో జో బిడెన్ భేటీ.. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు..

G20 Summit 2023: ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశ అనంతరం ఇరుదేశాల నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.జి-20 శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించినందుకు భారత్‌ను బిడెన్ ప్రశంసించారట. 

India US Release Joint Statement After PM Modi, Biden Hold Bilateral Talks KRJ
Author
First Published Sep 8, 2023, 11:40 PM IST

G20 Summit 2023:  దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న జీ-20 సదస్సుకు విదేశీ అతిథుల రాక కొనసాగుతోంది. శుక్రవారం (సెప్టెంబర్ 8) అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో అమెరికా అధ్యక్షుడికి కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ స్వాగతం పలికారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత జో బిడెన్ ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇది దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సమావేశానికి సంబంధించి ప్రధాన మంత్రి ఆఫీస్ (PMO) తన ట్విట్టర్ (X) లో పోస్ట్ చేసింది. US అధ్యక్షుడు జో బిడెన్, PM మోడీ కలుసుకున్నట్లు పేర్కొంది. వారి మధ్య అనేక రకాల సమస్యలపై చర్చలు జరిగినట్టు తెలిపింది. ఈ ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారతదేశం, అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం కానున్నాయని తెలిపింది. 

ప్రధాని మోదీ ట్వీట్ 

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ను కలిసిన తర్వాత.. ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. "అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు స్వాగతం పలకడం సంతోషంగా ఉంది. మా సమావేశం చాలా అర్థవంతంగా జరిగింది. మేము భారతదేశం, అమెరికా మధ్య అనేక అంశాలపై చర్చించాం. మేము ఇరు దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకువెళతాం. ప్రపంచ శ్రేయస్సును అభివృద్ధి చేయడంలో మన దేశాల మధ్య స్నేహం గొప్ప పాత్ర పోషిస్తుంది " అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. జి-20 శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించినందుకు భారత్‌ను కూడా బిడెన్ ప్రశంసించారని తెలిపారు.

ప్రధాని మోదీ అమెరికా అధికారిక పర్యటన సందర్భంగా (జూన్‌లో) తీసుకున్న నిర్ణయాల పురోగతిని ఈ సమావేశంలో ఇరువురు నేతలు సమీక్షించవచ్చని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ సమావేశానికి ముందు తెలిపారు. 
 
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ల ద్వైపాక్షిక సమావేశంలో 6జీ స్పెక్ట్రమ్, ఉక్రెయిన్, పౌర అణు రంగంలో పురోగతి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో GE జెట్ ఇంజిన్ ఒప్పందం, ప్రిడేటర్ డ్రోన్ కొనుగోలు సంబంధించిన విషయాలను కూడా చర్చినట్టు తెలుస్తుంది. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో అమెరికా 400 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. 

అలాగే.. గల్ఫ్ దేశాలు, ఇతర అరబ్ దేశాలను అనుసంధానించడానికి అమెరికా- భారతదేశం, అరబ్ దేశాలతో కీలక ఒప్పందాన్ని ప్రకటించాలని యోచిస్తున్నట్లు వచ్చిన నివేదికలను జేక్ సుల్లివన్ ధృవీకరించలేదు. అయితే.. ఇది తనతో కలిసి ప్రయత్నించిన చొరవ అని చెప్పారు. భారతదేశం నుండి మధ్యప్రాచ్యం అంతటా.. ఐరోపాకు కనెక్టివిటీ చాలా ముఖ్యమైనదని మేము విశ్వసిస్తున్నామని, ఇందులో పాల్గొన్న అన్ని దేశాలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలతో పాటు వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తామని ఆయన అన్నారు.  

బిడెన్, ప్రధాని మోదీ మధ్య జరిగిన సమావేశంలో అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా పాల్గొనగా, భారత్ నుంచి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొనడం గమనార్హం.  

 రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్న బిడెన్

వియత్నాంకు బయలుదేరే ముందు.. జో బిడెన్ ఆదివారం రాజ్‌ఘాట్ మెమోరియల్‌ను కూడా సందర్శించనున్నారు. G-20 గ్రూప్‌లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్ ఉన్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ (EU) చేర్చబడ్డాయి.

Follow Us:
Download App:
  • android
  • ios