భారత్‌లో కొన్ని ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని అమెరికా మంత్రి పేర్కొనడం కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలపై భారత్ దీటుగా కౌంటర్ ఇచ్చింది. ప్రజలు అభిప్రాయాలు కలిగి ఉండటంతో తప్పులేదని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. తాము కూడా అమెరికా సహా ఇతర దేశాలపై ఇలాంటి అభిప్రాయాలను వెల్లడించగలమని వివరించారు. 

న్యూఢిల్లీ: అమెరికా, భారత్ మధ్య పాక్షికంగా ద్వైపాక్షిక యుద్ధం జరుగుతున్నట్టుగానే అనిపిస్తున్నది. ఉభయ దేశాలు పరస్పరం మాటలు రువ్వుకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం పునాదిగా మన శం, అమెరికా మధ్య అడ్డుగోడలు మొలుస్తున్నాయి. రష్యా నుంచి చౌకగా చమురును దిగుమతి చేసుకునే అంశంపై అమెరికా హెచ్చరించగా.. భారత్ దానికి బలమైన కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి అదే దూకుడును ప్రదర్శించింది.

భారత్‌లో ఇటీవలే ముందుకు వచ్చిన కొన్ని ఆందోళనకర పరిణామాలను అమెరికా పరిశీలిస్తున్నదని, కొన్ని ప్రభుత్వాలు, పోలీసులు, జైలు అధికారులు మానవ హక్కులను ఉల్లంఘించడాన్ని చూస్తున్నామని అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ టఫ్ కౌంటర్ ఇచ్చారు. భారత్‌కు కూడా అమెరికాపై ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయని అన్నారు. అమెరికా మంత్రులు ఆంటోనీ బ్లింకెన్, లాయిడ్ ఆస్టిన్‌లు, భారత మంత్రులు ఎస్ జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్‌ల 2+2
మీటింగ్ తర్వాత అమెరికా ఈ ప్రకటన చేసింది. దీనిపై తాజాగా, కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. 

2+2 భేటీలో అసలు మానవ హక్కుల అంశం అజెండాలో లేనే లేదని వివరించారు. మానవ హక్కుల గురించి గతంలో మాట్లాడుకున్నామని, ఆ భేటీ తర్వాతే తాను విలేకరులతో చెప్పాల్సింది చెప్పేశానని అన్నారు. ఒక వేళ అలాంటి వాటి గురించి మాట్లాడాలనిపిస్తే.. భారత్ కూడా వెనుకాడబోమదని వివరించారు. ఈ భేటీలో మానవ హక్కుల గురించి తాము చర్చించలేదని స్పష్టం చేశారు. ఇందులో తాము ప్రధానంగా రాజకీయాలు, మిలిటరీ వ్యవహారాల గురించే మాట్లాడుకున్నామని తెలిపారు.

భారత్‌పై అభిప్రాయాలు కలిగి ఉండటంలో తప్పులేదని, ఎందరో ప్రజలు ఎన్నో అభిప్రాయాలు కలిగి ఉంటారని చెప్పారు. అదే విధంగా భారత్ కూడా వారి అభిప్రాయాలు, ప్రయోజనాలు, లాబీలు, వారి ఓటు బ్యాంకు రాజకీయాలపైనా అభిప్రాయాలు కలిగి ఉంటుందనేది గుర్తెరగాలి అని స్పష్టం చేశారు. ఎప్పుడైనా ఒక చర్చ జరుగుతున్నదంటే.. భారత్ కూడా మాట్లాడటానికి వెనుకాడబోదని స్పష్టంగా గుర్తుంచుకోవాలి అని అన్నారు. అంతేకాదు, అమెరికా సహా ఇతర దేశాల్లోనూ మానవ హక్కుల గురించి తాము కూడా అభిప్రాయాలు ఏర్పరుచుకుని వెల్లడించగలం అని పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు.