Asianet News TeluguAsianet News Telugu

వచ్చే నెల 15 నుంచి అంతర్జాతీయ విమాన సేవల పునరుద్ధరణ: కేంద్రం ప్రకటన.. కండీషన్స్ ఇవే

అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 15వ తేదీ నుంచి అంతర్జాతీయ సేవలపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఇప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా తీవ్ర స్థాయిలో ఉండటంతో ఆయా దేశాల పరిస్థితులను బట్టి ఆంక్షలతో ఈ అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులో ఉండనున్నాయి. కాగా, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన బీ.1.1.529 కొత్త వేరియంట్ కలకలం రేపుతుండటంతో ఇప్పటికే కొన్ని ఐరోపా దేశాలు విమాన సేవలను నిలిపేసే నిర్ణయం తీసుకున్నాయి.
 

india to resume international flights next month
Author
New Delhi, First Published Nov 26, 2021, 7:07 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరి నుంచి అంతర్జాతీయ విమాన సేవలు సాధారణ స్థితికి రావచ్చని ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ ఇచ్చిన సంకేతాలను నిజం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం వెల్లడించింది. కేంద్ర హోం వ్యవహారాలు, ఆరోగ్య శాఖ, విదేశాంగ శాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత పరిస్థితులను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 

అయితే, ఈ ఆంక్షల ఎత్తివేతలోనూ కేంద్రం కొన్ని కండీషన్లు విధించింది. కరోనా మహమ్మారి విజృంభణ కొన్ని దేశాల్లో ఇంకా కొనసాగుతున్న తరుణంలో రిస్కు ఆధారంగా విమాన సేవలను నిర్ధారించింది. అన్ని దేశాలను మూడు వర్గాలుగా విభజించింది. కరోనా రిస్కులేని దేశాలు, కరోనా రిస్కు ఉన్నా మన దేశంతో ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని కలిగి ఉన్న దేశాలు, కరోనా రిస్కు ఉండి మన దేశంలో ఎయిర్ బబుల్ ఒప్పందం లేని దేశాలుగా విభజించింది. ఈ విభజన ఆధారంగానే విమానాల్లో ప్రయాణికుల సామర్థ్యాన్ని నిర్ధేశించింది.

Also Read: వచ్చే నెలలో అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షల ఎత్తివేత!.. కేంద్రం కీలక ప్రకటన

కరోనా మహమ్మారి ముప్పు లేని దేశాల నుంచి అంతర్జాతీయ విమాన సేవలు పూర్వస్థితిలో ఉన్నట్టుగానే అందుబాటులో ఉంటాయి. అంటే ఈ దేశాల నుంచి ఫుల్ కెపాసిటీతో విమానాలు నడుస్తాయి. ఈ దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాలు కలిగి ఉంటే ఆ ఒప్పందం రద్దు అవుతుంది. కాగా, ఎయిర్ బబుల్ ఒప్పందం కలిగి ఉండి కరోనా ముప్పు ఉన్న దేశాలతో ప్రయాణికుల సంఖ్యపై ఆంక్షలు విధించింది. ఈ దేశాలకు, భారత్‌కు మధ్య 75శాతం కెపాసిటీతో విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. మనదేశ లేదా సదరు దేశ విమాన సంస్థలు కరోనా పూర్వ స్థితితో పోల్చితే 75శాతం సామర్థ్యంతో ప్రయాణికులను మోసుకెళ్లవచ్చు. కాగా, మన దేశంలో ఎయిర్ బబుల్ ఒప్పందం లేకుండా ఇప్పటికీ కరోనా ముప్పు ఉన్న దేశాలకు మన దేశానికి మధ్య విమానాలు కేవలం 50శాతం సామర్థ్యంలోనే నడుస్తాయి. యూకే, సింగపూర్, చైనా, బ్రెజిల్, బంగ్లాదేశ్, మారిషస్, జింబాబ్వే, న్యూజీలాండ్, సౌత్ ఆఫ్రికా, బోట్స్‌వానా సహా పలుదేశాలతో ఎయిర్ బబుల్ ఉండి రిస్క్ కేటగిరీలో ఉన్నాయి. ఈ దేశాలకు 75 శాతం కెపాసిటీతో విమానాలు నడుస్తాయి.

 

కరోనా మహమ్మారి విజృంభణతో గతేడాది మార్చి 23న కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించింది. కేవలం కార్గో, అత్యవసర సరుకుల రవాణా చేసే విమానాలకు మినహాయింపు ఇచ్చింది. వీటితోపాటు డీజీసీఏ ప్రత్యేక అనుమతులు ఉన్న విమానాలకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో మళ్లీ అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి రాలేవు. అయితే, భారత ప్రభుత్వం కొన్ని దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని పెట్టుకుంది. అంటే, ఆ రెండు దేశాల మధ్య విమాన సేవలు కొన్ని ఆంక్షలతో నిర్దేశించిన సార్లు మాత్రమే ట్రిప్ వేసేలా అంగ్రీమెంట్లు పెట్టుకుంది. ఇలా ఇప్పటి వరకు సుమారు 28 దేశాలతో భారత ప్రభుత్వం ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని పెట్టుకుంది.

Also Read: 18 నెలల తర్వాత టూరిస్టులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్.. 99 దేశాల పర్యాటకులకు క్వారంటైన్ అక్కర్లేదు

అయితే, దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్త వేరియంట్ కలకలం రేపుతుండటంతో ఇప్పుడు కొన్ని దేశాలు మళ్లీ విమాన సేవలపై ఆంక్షలు విధించే పనిలో పడ్డాయి. బీ.1.1.529 వేరియంట్ వేగంతో అత్యధిక మ్యుటేషన్లతో ప్రమాదకారిగా ఉన్నట్టు తెలుస్తున్నది. వ్యాక్సిన్ శక్తిని ఈ వేరియంట్ అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సౌత్ ఆఫ్రికా సహా దాని చుట్టుపక్కల దేశాల నుంచి కొన్ని ఐరోపా దేశాలు విమాన సేవలను నిలిపేశాయి. యూకే, జర్మనీ, ఇటలీ దేశాలు ఇప్పటికే ఈ నిబంధనలను ప్రకటించాయి. కాగా, త్వరలోనే యూరోపియన్ యూనియన్ కూడా ఈ తరహా ప్రతిపాదన చేసే యోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios