చైనా కిట్లపై విమర్శలు.. ఇక భారత్‌లోనే తయారీ, మే చివరికల్లా అందుబాటులోకి: కేంద్రం
దేశవ్యాప్తంగా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ స్పందించారు.
దేశవ్యాప్తంగా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ స్పందించారు. ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకునే బదులు స్వదేశంలో కిట్లను తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
మే నెలాఖరుకు భారతదేశంలోనే ఆర్‌టీ-పీసీఆర్, యాంటీ బాడి టెస్ట్ కిట్లను ఉత్పత్తి చేస్తామని అన్ని ప్రక్రియలు అధునాతన దశలో ఉన్నాయని హర్షవర్థన్ వెల్లడించారు. ఐసీఎంఆర్ నుంచి ఆమోదం లభించగానే టెస్టు కిట్ల ఉత్పత్తి ప్రారంభిస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
Also Read:యోగికి ఉద్ధవ్ పంచ్: యూపీ సాధువుల హత్యపై ఫోన్
మే 31 కల్లా దేశంలో రోజుకు లక్ష పరీక్షలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న యాంటీ బాడీ టెస్టు ఫలితాల్లో ఎంతో వైరుధ్యం కనిపిస్తోంది.
ఫలితాలపై స్పష్టత లేకపోవడంతో వాటిని ఉపయోగించొద్దని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఐసీఎంఆర్ సూచించింది. ఈ ఆర్డర్‌లకు సంబంధించిన పేమెంట్ ఇంకా చెల్లించలేదు కాబట్టి ఒక్క రూపాయి సైతం నష్టం వుండదని తెలిపింది.
Also Read:గుడ్‌న్యూస్: లాక్‌డౌన్ ఎత్తివేశాక విదేశాల్లో ఉన్న ఇండియన్స్ స్వదేశానికి
మరోవైపు తమ సంస్థలు తయారు చేస్తున్న టెస్టు కిట్ల ఫలితాల్లో తేడాలు కనిపిస్తుండటంతో చైనా ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. వాస్తవ పరిస్ధితులు తెలుసుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఆ దేశ దౌత్యకార్యాలయం వెల్లడించింది. ఇతర దేశాలకు ఎగుమతి చేసే టెస్టు కిట్ల నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. కరోనాపై గెలిచేందుకు భారత్‌కు సాయం చేస్తామని పేర్కొంది.