తమ చెరలో ఉన్న భారత నేవీ కమాండర్ కులభూషణ్ జాదవ్ ను కలిసేందుకు రాయబార అనుమతిని ఇస్తామంటూ పాకిస్థాన్ గురువారం ప్రకటించింది. ఆగస్టు 2వ తేదీన కులభూషణ్ ను కలిసేందుకు భారత్ అధికారులు కాన్సులర్ యాక్సెస్ ఇస్తామని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతనిధి వెల్లడించారు. కాగా... పాక్ ఇచ్చిన ఈ ఆఫర్ పై ఇప్పటి వరకు భారత్ స్పందించకపోవడం గమానార్హం.

గూఢచర్యం ఆఱోపణలతో కులభూషణ్ జాదవ్ కు విధించిన మరణ దండనను జులై 18న అంతర్జాతీయ న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కులభూషణ్ విషయంలో పాక్ వ్యవహరించిన తీరును న్యాయస్తానం తప్పుపట్టింది. వియన్నా ఒప్పందం ప్రకారం కులభూషణ్ ను కలిసేందుకు భారత్ కాన్సులర్ కి అనుమతి ఇవ్వకపోవడాన్ని కూడా తప్పుపట్టింది.

ఈ ఆదేశాలు వెలువడి దాదాపు 15రోజుల అనంతరం పాక్ దిగి వచ్చింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు భారత రాయబార సంబంధాలపై వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36, పారా గ్రాఫ్1(బీ) ప్రకారం కులభూషణ్ కు తన హక్కులు తెలియజేశామని, బాధ్యతాయుతమైన దేశంగా ఆయనను కలిసేందుకు భారత కాన్సులర్ కి అనుమతి ఇచ్చామని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది.మరి దీనికి భారత్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.