భారత్ లోకరోనా విలయతాండవం ఇప్పట్లో ఆగేలా కనపడటం లేదు. రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశంలో పది లక్షల మందికి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల్లో కరోనా విషయంలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ కేసుల పెరుగుదల చూస్తుంటే... త్వరలోనే మొదటి స్థానంలోకి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

24 గంటల్లో 34,884 మందికి పాజిటివ్‌ తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 10,38,716కు చేరుకుందని కేంద్రం తెలిపింది. ఒక్క రోజులోనే అత్యధికంగా మరో 671 మంది కోవిడ్‌ బారిన పడి చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 25,602కు పెరిగిపోయిందని వెల్లడించింది. 

దేశంలో 3,42,473 యాక్టివ్‌ కేసులుండగా..మహమ్మారి బారిన పడి 6లక్షల మంది కోలుకున్నారు. మహారాష్ర్ట, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌, యూపీ, ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదిలా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వైరస్ వృద్ధిని దృష్టిలో పెట్టుకొని.. మరింత ఎక్కువ మందికి పరీక్షలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ఈ నియమాన్ని పాటిస్తుండగా.. తెలంగాణలో త్వరలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.