పుల్వామాలో 42 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడంతో ముష్కర మూకలకు గట్టి బుద్ది చెప్పాలని యావత్ దేశం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది.

దీంతో ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలతో పక్కా ప్రణాళికతో భారత వాయుసేన బాలాకోట్‌, పాక్ అక్రమిత కశ్మీర్‌‌లోని ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసి తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది.

అయితే శత్రు సైన్యానికి చిక్కకుండా.. భారత్ ఇంత పక్కాగా దాడులు ఎలా చేయగలిగిందన్న దానిపై తాజాగా భారత వాయుసేనకే చెందిన ఇద్దరు పైలెట్లు కొన్ని వివరాలను ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు.

పుల్వామా ఘటన తర్వాత జైషే మొహమ్మద్ అంతు చూడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని దీనిలో భాగంగానే బాలకోట్ ఉగ్ర శిబిరాన్ని టార్గెట్ చేసినట్లుగా తెలిపారు. దాడికి సరిగ్గా రెండు రోజుల ముందు నుంచి భారత్-పాక్ సరిహద్దులకు అత్యంత దగ్గరగా కాంబాట్ ఎయిర్ పెట్రోల్‌లు పెంచారని ఒక పైలట్ తెలిపారు.

పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సామర్ధ్యాన్ని అంచనా వేసి దానిని తప్పుదోవ పట్టించడానికి వీటి ఉద్ధృతిని పెంచామని.. తద్వారా భారత్ ఇలా ఎందుకు చేస్తోందో అర్ధం కాక పాక్ గందరగోళానికి గురైందన్నారు.

మరో పైలట్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్పైస్-2000 బాంబులను బయటకు తీశామని.. వాటిని మిరాజ్-2000 యుద్ధ విమానాలకు అమర్చారని... అనంతరం బాలాకోట్ ఉగ్ర క్యాంప్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆ స్మార్ట్‌ బాంబ్‌లో నిక్షిప్తం చేశారని పైలట్ తెలిపారు.

ఫిబ్రవరి 26న ఇంధనాన్ని ఫుల్లుగా నింపుకున్న యుద్ధ విమానాలు దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి బయలుదేరి కశ్మీర్‌కు చేరగానే రేడియో సైలెన్స్‌ను పాటించాయి.

ఈ విమానాలకు రక్షణ కల్పించడానికి, ప్రత్యర్ధులను తప్పుదోవ పట్టించడం కోసం సుఖోయ్-30 ఎంకేఐ విమానాలు, తమకు మార్గం చూపించడానికి అవాక్స్ విమానం, గాల్లోనే ఇంధనం నింపేందుకు మరో ట్యాంకర్ విమానం కూడా గాల్లోకి లేచాయని తెలిపారు.

అలాగే ఎవరికీ అనుమానం రాకుండా తమ అధికారులు తమ రోజువారీ పనులను యథాతథంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఇక దాడిలో అత్యంత కీలకమైన పని శత్రువుల కళ్ళుగప్పడం.

దీనిలో భాగంగా మాలోని ఒక బృందం వేరే మార్గంలో వెళ్లిందని.. తాము పాక్ భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత కేవలం 90 నిమిషాల్లోనే పని ముగించుకొని వెనక్కి వచ్చేసినట్లు ఆయన వెల్లడించారు.

తాను ఈ దాడిలో పాల్గొన్న విషయం తన భార్యకు కూడా తెలియదని ఆయన తెలిపారు. ఆ తర్వాత బాలోకోట్‌లో దాడులు జరగలేదని ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్తాన్ అనేక డ్రామాలు ఆడింది.

భారత దాడిలో తమ వైపు ఎవరూ చనిపోలేదని... కేవలం చెట్లు మాత్రమే కూల్చేసిందని చెబుతూ ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు కూడా చేసింది. మరోవైపు బాలాకోట్ దాడి తర్వాత పాకిస్తాన్ కూడా ప్రతి దాడికి ప్రయత్నించగా... భారత వాయుసేన దానిని సమర్థవంతంగా తిప్పికొట్టింది.

ఈ క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ విమానాన్ని కూల్చివేశాడు. అదే సమయంలో ఆయన విమానం పీఓకేలో కూలడంతో పాక్ బలగాలకు చిక్కారు. భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం ఒత్తిడికి లొంగిన దాయాది దేశం అతనిని విడిచిపెట్టింది.