భారత్ ఎప్పుడూ శాంతి వైపు నిలబడుతుందని కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ పార్లమెంట్ కు మరో సారి స్పష్టం చేశారు. బుధవారం లోక్ సభలో మాట్లాడిన ఆయన బుచాలో పౌర హత్యలను మన దేశం ఖండిస్తోందని తెలిపారు.
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లోని బుచాలో పౌర హత్యల నివేదికలపై స్వతంత్ర దర్యాప్తునకు భారతదేశం మద్దతు ఇస్తుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. బుచాలో జరిగిన హత్యలను భారతదేశం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ‘‘ ఇది చాలా తీవ్రమైన విషయం. స్వతంత్ర దర్యాప్తు కోసం మేము మద్దతు ఇస్తున్నాము ’’ అని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం కేంద్ర మంత్రి జై శంకర్ పార్లమెంట్ లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ ను వివరించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ శాంతిని ఎన్నుకుందని చెప్పారు. ‘‘ భారతదేశం ఒక పక్షాన్ని ఎంచుకుంది. అది శాంతి వైపు, హింసను తక్షణమే అంతం చేయడం వైపు ఉంటుంది. ఇది మన సూత్రప్రాయమైన వైఖరి. UNతో సహా అంతర్జాతీయ వేదికలు, చర్చలలో మన స్థానాన్ని నిలకడగా మార్గనిర్దేశం చేస్తుంది ’’ అని అన్నారు.
ఉక్రెయిన్, రష్యాల మధ్య చర్చలు జరిగాలని, ఆ రూపంలోనే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ ఒత్తిడి కొనసాగిస్తోందని జైశంకర్ అన్నారు. హింసను అంతం చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. రక్తం చిందించడం ద్వారా, అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టడం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించదు అని జై శంకర్ తెలిపారు.
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా సవాళ్లు అపూర్వమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో అన్నారు. భారత్‌లాగా ఏ దేశం కూడా ఖాళీ చేయలేదని పేర్కొన్నారు. ‘‘ మన నుంచి ఇతర దేశాలు ప్రేరణ పొందాయి. భారత దేశం ఎలా చొరవ తీసుకుంటోందో ఇతర దేశాయి చూశాయి. వారు కూడా మనలాంటి ఎత్తుగడలు అమలు చేయాలని భావిస్తుయి’’ అని ఆయన తెలిపారు.
ఖార్కివ్, సుమీ నుండి తరలింపు సమయంలో రష్యన్లు భారతీయులకు సహాయం చేశారని ఆయన అన్నారు. వ్లాదిమిర్ పుతిన్, వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ పరస్పర చర్య వల్ల తరలింపులు సాధ్యమయ్యాయి. ఉక్రెయిన్ లో ఒక్క సారిగా మారిపోయిన పరిస్థితులు భారతీయ విద్యార్థులను గందరగోళంలో పడేసిందని ఆయన అన్నారు. ‘‘ నలుగురు మంత్రులు ఉక్రెయిన్ పొరుగు దేశాలకు వెళ్లకపోతే, భారతదేశానికి అదే స్థాయిలో సహకారం లభించేది కాదు ’’ అని ఆయన పార్లమెంట్ కు తెలిపారు.
గత నెల 24వ తేదీన కూడా కేంద్ర విదేశాంగ మంత్రి ఇదే విషయాన్ని పార్లమెంట్ కు తెలియజేశారు. కేరళ కాంగ్రెస్ ఎంపీ జోస్ కె మణి లేవనెత్తిన ప్రశ్నకు ప్రతిస్పందనగా ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. “ మన సూత్రాలపై మేము చాలా స్పష్టంగా ఉన్నాము. అంతర్జాతీయ క్రమం తప్పనిసరిగా ప్రాదేశిక సమగ్రతను, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలనే నమ్మకంతో పని చేస్తున్నాం ’’ అని అన్నారు. మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ రష్యా, ఉక్రెయిన్‌లకు ఎదురైన సమస్య మనది కాదని భారత్ ఎప్పుడూ అనుకోవడం లేదని చెప్పారు. మనం శాంతి కోసం ఉన్నామని అదే మన స్థానం అని తెలిపారు. 2022 ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారతీయ పౌరులను, 147 మంది విదేశీయులను ప్రభుత్వం సురక్షితంగా ఇంటికి తీసుకురాగలిగిందని చెప్పారు.
