రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉద్రిక్తంగా మారింది. అక్కడి భారత పౌరులు చిక్కుకుపోయారు. విమాన సేవలూ నిలిచిపోవడంతో వారిని స్వదేశానికి తీసుకురావడం కష్టతరంగా మారింది. దీంతో భారత విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో వారిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. 

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) యుద్ధాన్ని ప్రకటించింది. ఉక్రెయిన్‌పై దాడి చేయకతప్పడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) తెలిపారు. ఈ ప్రకటన తర్వాత రష్యా సేనలు(Army) దాడులు చేయడం ప్రారంభించాయి. బాంబులు, క్షిపణి దాడులు చేశాయి. జనసమ్మర్థం అధికంగా లేని ప్రాంతాల్లోనే దాడులు జరుపుతామని రష్యా ప్రకటించింది. అయినప్పటికీ కొన్ని కీలక ప్రాంతాలు అంటే విమానాశ్రయాల పైనా దాడులు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్, రాజధాని కీవ్‌లో దాడులు జరిగాయి. దీంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ దాడులు మొదలైన సందర్భంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే భారత పౌరులు, విద్యార్థుల రక్షణ కోసం అక్కడి భారత దౌత్యకార్యాలయం పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంత త్వరగా విద్యార్థులు భారత్ వెళ్లిపోవాలనీ సూచించింది. కాగా, ఇప్పుడు పరిస్థితులు మరీ ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది. 

ఢిల్లీలోని విదేశాంగ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కకున్న భారత పౌరులకు అందుబాటులో ఉండటానికి 24/7 హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రకటించింది. ఆ ఫోన్ నెంబర్లు ఇలా ఉన్నాయి. అవి.. 1800118797 (టోల్ ఫ్రీ), +91-11-23012113, +91-11-23014104, +91-11-23017905. భారత పౌరులు మరీ ముఖ్యంగా భారత విద్యార్థుల రక్షణ తమ ప్రాధాన్యం అని అధికార వర్గాలు వెల్లడించాయి. 

తూర్పు ఉక్రెయిన్, రష్యా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు ఈ రోజు ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను రక్షించుకోవడానికి, ఆ దేశంలోని కీలక ప్రాంతాల్లో గగనతలాన్ని మూసేయడంతో వారిని స్వదేశానికి రప్పించడానికి అవలంభించాల్సిన ప్రత్యామ్నాయ మార్గాల గురించి చర్చలు జరిపారు.

ఉక్రెయిన్‌లోని తమ ఎంబస్సీ ఇంకా సేవలు అందిస్తున్నాయని, ఆ కార్యాలయం విడుదల చేసే అన్ని సూచనలు పాటటించాలని అధికారవర్గాలు తెలిపాయి.

ఉక్రెయిన్‌లోని పౌరులు రాజధాని కీవ్‌కు రావద్దని, ఒక వేళ రావాలనుకున్నవారు తాత్కాలికంగా వెనక్కి తిరిగి వెళ్లాలని ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ తెలిపింది. ఉక్రెయిన్‌ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నట్టు వివరించింది. ప్రతి ఒక్కరూ తమ పాస్‌పోర్టులు, సంబంధిత అన్ని డాక్యుమెంట్లను వెంట పెట్టుకుని ఉండాలని పేర్కొంది. ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాట్లు పూర్తయ్యాక వివరాలు తెలియజేస్తామని తెలిపింది. అంతేకాదు, ఎంబసీ కూడా భారత పౌరుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్లు విడుదల చేసింది. అవి.. +38 0997300483, +38 0997300428, +38 0933980327, +38 0635917881, +38 0935046170.

ఉక్రెయిన్‌లో మార్షల్ లా అమల్లో వుందని.. ప్రయాణాలు కష్టంగా మారాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. కీవ్‌లో చిక్కుకున్న వారి కోసం స్థానిక యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. కీవ్‌లో బాంబు వార్నింగ్‌లు, ఎయిర్‌ సైరన్ల మోత వుందని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో తలదాచుకుంటున్నారని చెప్పింది. పాస్‌పోర్టులతో వీలైనంత వరకు ఇళ్లలోనే వుండాలని.. సైరన్ వినిపిస్తే గూగుల్ మ్యాప్ సాయంతో బాంబ్ షెల్టర్లకు చేరుకోవాలని తెలిపింది.