భారత్ లో 16 లక్షలు దాటిన కరోనా కేసులు
గడచిన 24 గంటల్లో ఈ మహమ్మారికి మరో 779 మంది బలికావడంతో.. దేశంలో కరోనా మరణాల సంఖ్య 35,747కు పెరిగింది.
భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏకంగా 55,079 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపి భారత్‌లో కొవిడ్ బాధితుల సంఖ్య 16 లక్షలు దాటినట్టు ప్రకటించింది.
ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం కేసులు 16,38,871కి చేరాయి. వీరిలో ఇప్పటికే 10,57,806 మంది కోలుకోగా... ప్రస్తుతం 5,45,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో ఈ మహమ్మారికి మరో 779 మంది బలికావడంతో.. దేశంలో కరోనా మరణాల సంఖ్య 35,747కు పెరిగింది.
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలో ప్రస్తుతం 1,48,454 మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు 14,729 మంది మృత్యువాత పడ్డారు. తమిళనాడులో 57,962 యాక్టివ్ కేసులు ఉండగా... 3,838 మంది మృత్యువాత పడ్డారు. ఇక దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 10,743 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 3,936 కరోనా మరణాలు నమోదయ్యాయి