దుబాయ్‌లో మంచి ఉద్యోగాలు అని చెప్పి కొందరు యువకులను ఏజెంట్లు దారుణంగా మోసం చేశారు. దుబాయ్ కాకుండా వారిని లిబియాలోని ఓ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో వదిలిపెట్టారు. వారికి జీతమే ఇవ్వకుండా కట్టుబానిసలుగా గొడ్డు చాకిరి చేయించారు. రోజుకకు 15 గంటలపాటు పని చెప్పారని తెలిసింది. తాజాగా, వారిని ప్రభుత్వం వెనక్కి తేగలిగింది.
న్యూఢిల్లీ: 12 మంది భారతీయులు ఫేక్ జాబ్ రాకెట్ బారిన పడ్డారు. దుబాయ్‌లో మంచి జీతం ఉన్న ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లిబియాకు తీసుకెళ్లారు. అక్కడ గొడ్డు చాకిరి చేయించుకున్నారు. ఓ కన్‌స్ట్రక్షన్ సైట్ దగ్గర డబ్బులు ఇవ్వకుండా రోజుకు 15 గంటలపాటు వారిని బానిసలుగా పని చేయించుకున్నారు. పని చేయడానికి తిరస్కరిస్తే దాడి చేసేవారు. ఆ 12 మంది బాధితులను కేంద్ర ప్రభుత్వం రక్షించింది. సురక్షితంగా మన దేశానికి తెచ్చింది. జాతీయ మైనార్టీ కమిషన్, కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా లిబియాలో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తెప్పించాయి.
కరోనా మహమ్మారి కాలంలో ఎందరో మంది ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఆ తర్వాత ఏ పని దొరికితే అది చేసుకుంటూ పొట్టపోసుకున్నారు. ఇలాంటి ఓ 12 మంది డబ్బులు సంపాదించడానికి వేరే దేశం వెళ్లడానికైనా సిద్ధమయ్యారు. వారిని కొందరు సిక్కుల ఏజెంట్లు ఆకర్షించారు. డిసెంబర్, జనవరి నెలల్లో వారిని దేశం దాటించారు. దుబాయ్‌లో ఉద్యోగాలని, మంచి జీతాలు లభిస్తాయని వారిలో ఆశపెట్టి బయటి దేశానికి పంపించారు. పంజాబ్‌లోని కొందరు నిరుద్యోగ యువకులు జాబ్ స్కామ్‌లలో బాధితులుగా మిగిలారని నేషనల్ మైనార్టీస్ కమిషన్ చైర్మన్ ఇక్బల్ సింగ్ లాల్పురా తెలిపారు.
Also Read: పిల్లలు తనను చూడడంలేదని.. కోటిన్నర ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చిన 85 ఏళ్ల వృద్ధుడు..
బాధితులను లిబియాకు తీసుకెళ్లిన తర్వాత ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగులు చూపించారు. కానీ, జీతాలు ఇవ్వకుండా కట్టుబానిసలను చేసుకున్నారు. వారిని రక్షించాలని లల్పురా కేంద్ర మంత్రిత్వ శాఖను కోరారు. ట్యూనీషియాలోని భారత ఎంబసీని కూడా దీని కోసం సంప్రదించారు.
ఆ ఎంబసీ వివరాల ప్రకారం, లిబియాలోని బెంఘాజికి చెందిన స్థానికుడు ఒకరు వారికి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఇవ్వడానికి ముందు వచ్చాడు. అక్కడ చిక్కుకున్న భారతీయులకు రిలీఫ్ సప్లైలు చేశాడు.
మంత్రిత్వ శాఖ, ఎంబసీల సహాయంతో 12 మందిలో నలుగురిని తొలిగా లిబియా నుంచి ఫిబ్రవరి 12వ తేదీన భారత్‌కు తీసుకువచ్చారు. కాగా, మిగిలిన భారతయులను మార్చి 2వ తేదీన వెనక్కి తెచ్చినట్టు ఓ ప్రకటనలో కేంద్రం తెలిపింది.
