గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా తాజాగా 68,020 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ తరువాత ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. దీని ప్రకారం ఒకే రోజు 291 మరణాలు నమోదుకాగా, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 35,498కి పెరిగాయి. 

ప్రస్తుతం దేశంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 1.2 కోట్లుగా ఉంది. 2020 జనవరిలో దేశంలో కరోనా అవుట్ బ్రేక్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 1,61,843 మరణాలు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రెండోసారి లాక్ డౌన్ గురించి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 40,414 కేసులు, 108 మరణాలతో మహారాష్ట్ర టాప్ లో ఉంది. ఆరోగ్య సూచనల విషయంలో నిర్లక్ష్యాన్ని ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అంతేకాదు శనివారం అర్ధరాత్రి నుండి కఠినమైన రాత్రి కర్ఫ్యూ ను విధించింది. 

మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కరోనా వైరస్ ప్రారంభం నుంచి నేటి వరకు ఒక్క శనివారమే రికార్డు స్థాయిలో అత్యథిక కేసులు నమోదై కలవరపెడుతున్నాయి. 

ఢిల్లీ ప్రభుత్వం కూడా పెళ్లీలు, అంత్యక్రియలు లాంటి సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలు కఠినం చేసింది. ఈ తరువాతి స్థానాల్లో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల వేళ కోవిడ్ 19 సెకండ్ వేవ్  వచ్చింది.  ఆయా రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో సంక్రమణ వేగంగా వ్యాప్తి చెందుతుందనే భయాలను పెంచుతుంది.

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శనివారం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఐదు దశల వ్యూహాన్ని ప్రవేశపెట్టారు. అవేంటంటే.. టెస్టుల స్థాయిని పెంచడం, ఐసోలేషన్ ను పకడ్బందీగా నిర్వహించడం,  కాంటాక్ట్ ట్రేసింగ్ ఎక్కువ చేయడం, హెల్త్‌కేర్ కార్మికులను ఉత్తేజపరచడం, కోవిడ్ ప్రోటోకాల్స్ ను తప్పనిసరిగా పాటించేలా ఆంక్షలు విధించడం, టీకాల లక్ష్యాలను చేరుకోవడం.