దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. పెరుగుతున్న కరోనా కేసులు ఫోర్త్ వేవ్‌కు సంకేతమా..? అనే చర్చ సాగుతుంది.
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,329 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. కిందటి రోజు నమోదైన కేసులతో పోలిస్తే ఇది 9.8 శాతం అధికంగా ఉంది. తాజా కేసులలో అత్యధికంగా మహారాష్ట్రలో 3,081 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత అత్యధిక కేసులు ఉన్న నాలుగు రాష్ట్రాల జాబితాలో.. 2,415 కేసులతో కేరళ, 655 కేసులతో ఢిల్లీ, 525 కేసులతో కర్ణాటక, 327 కేసులతో హర్యానాలు నిలిచాయి. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో 84.08 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 36.99 శాతం కేసులు నమోదయ్యాయి.
తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య.. 4,32,13,435కి చేరింది. గత 24 గంటల్లో దేశంలో 10 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,24,757కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40,370గా ఉంది. భారతదేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 98.69 శాతంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 4,216 మంది రోగులు కోలుకోవడంతో దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,26,48,308కి చేరుకుంది. ఇక, దేశంలో ప్రస్తుతం కరోనా మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.09 శాతం వద్ద ఉంది.
భారతదేశం గత 24 గంటల్లో మొత్తం 15,08,406 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం డోసుల సంఖ్య.. 1,94,92,71,111కి పెరిగింది.
