భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,593 కరోనా కేసులు నమోదయ్యాయి. 44 మంది మృతిచెందారు.
భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,593 కరోనా కేసులు నమోదయ్యాయి. 44 మంది మృతిచెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,57,545కి చేరింది. మరోవైపు మొత్తం మరణాల సంఖ్య 5,22,193కి పెరిగింది.
గత కొద్ది రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల చోటుచేసుకోవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. దేశంలో ప్రస్తుతం 15,873కి చేరింది. కిందటి రోజుతో పోల్చితే 794 యాక్టివ్ కేసులు పెరిగాయి. మరోవైపు దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 98.75 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 1,755 కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,19,479కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 0.59 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.54 శాతంగా ఉంది.
ఇక, గడిచిన 24 గంటల్లో 4,36,532 పరీక్షలు నిర్వహించినట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన టెస్టుల సంఖ్య 83.47 కోట్లకు చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. శనివారం రోజున దేశంలో 19,05,374 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,87,67,20,318కి చేరింది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో ఆర్ వాల్యూ కూడా పెరగడం ఆందోళన కరంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా ఆర్ వాల్యూ 2.1కి చేరింది. ఇక, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ.. ఏప్రిల్ 27 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. ఇక, అంతకుముందు ఈ ఏడాది జనవరి 13న ప్రధాని ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల భారీగా ఉన్న సమయంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
