ఇండియాలో గత 24 గంటల్లో 25,467 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. 

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో ఇండియాలో 25,467 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 32,474,773కి చేరుకొంది. నిన్న ఒక్క రోజే 354 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,35,110కి చేరుకొంది.

దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,19,551కి చేరుకొంది. గత 156 రోజుల్లో కరోనా యాక్టివ్ కేసులు ఇంత తక్కువ స్థాయిలో నమోదు కావడం ఇదే ప్రథమంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా యాక్టివ్ కేసులు 1 శాతానికి తక్కువగా నమోదయ్యాయి.

2020 మార్చి తర్వాత కరోనా రోగుల రికవరీ రేటు 97.68 శాతంగా నమోదైంది.39,486 మంది కరోనా రోగులు నిన్న ఒక్క రోజే కోలుకోన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి 3,17,20,112 మంది కోలుకొన్నారని ఐసీఎంఆర్ తెలిపింది.

వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 1.90శాతానికి చేరుకొంది. గత 60 రోజులుగా వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 3 శాతానికి తక్కువగా నమోదైందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 1.55 శాతంగా ఉంది. గత 29 రోజులుగా రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 3 శాతానికంటే తక్కువగా నమోదైంది.

దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 50.93 కోట్ల మంది శాంపిల్స్ పరీక్షించారు. నిన్న ఒక్క రోజే 16,47,526 మంది శాంపిల్స్ సేకరించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది.