భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ దాదాపు 60వేల కేసులు నమోదౌతున్నాయి. అయితే.. అదృష్టవశాత్తు దేశంలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. ఈ విషయంలో తాజాగా భారత్ రికార్డు సాధించింది.

 దేశంలో ఒక్క రోజులో కరోనా నుంచి 56,000 మంది బాధితులు కోలుకున్నారు. ఇది ఒక్క‌ రోజులో అత్య‌ధికంగా కోలుకున్న బాధితుల సంఖ్య‌. వైద్యఆరోగ్య‌శాఖ వెల్ల‌డించిన‌ గణాంకాల ప్రకారం భారత్‌లో రికవరీ రేటు 70 శాతానికి చేరుకుంది. గడ‌చిన‌ 24 గంటల్లో నమోదైన అత్యధిక రికవరీ రేటు సమర్థవంతమైన వైద్య విధాన ఫలితమని వైద్య ఆరోగ్య‌శాఖ పేర్కొంది. దేశంలో క‌రోనా నుంచి కోలుకుంటున్న‌వారి సంఖ్య‌ క్రమంగా పెరుగుతోంది.

 జూలై మొదటి వారంలో రోజుకు 15 వేల మంది మాత్రమే కోలుకోగా, ఆగస్టు మొదటి వారంలో ఈ సంఖ్య 50 వేలు దాటింది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,43,948. ఇది మొత్తం కేసులలో 27 శాతం మాత్రమే. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలోని మూల్‌చంద్ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ  క‌రోనా నివార‌ణ‌కు ఇప్పు‌డు ఎక్కువ మందులు, సహాయక చికిత్సా విధానాలు అందుబాటులోకి వ‌చ్చాయి. 

క్లినికల్ నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు, అంబులెన్స్ సేవల‌ను ముమ్మ‌రం చేసే ప్రయత్నాలు జరిగాయి. తద్వారా బాధితునికి త‌గిన చికిత్స అందిస్తున్నారు. ఈ కారణంగానే క‌రోనా మ‌ర‌ణాల రేటు త‌గ్గ‌డంతోపాటు రిక‌వ‌రీ రేటు పెరిగింద‌న్నారు. మరణాల రేటు (సీఎఫ్ఆర్) ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉంది. ఇది ప్రస్తుతం 1.98శాతంగా ఉంది. దేశంలో క‌రోనా టెస్టుల‌ సంఖ్య కూడా పెరుగుతోంది.