న్యూఢిల్లీ: దేశంలో  కరోనా కేసుల నమోదు పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 22,27,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,08,921 మందికి కరోనా సోకింది. మంగళవారం నాడు  రెండు లక్షలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే బుధవారం నాడు మరోసారి రెండు లక్షలను కరోనా కేసులు దాటాయి. 

కరోనాతో మరణాల సంఖ్య మరోసారి పెరిగింది. గతంలో 4 లక్షలకు పైగా కరోనా కేసులతో పాటు నాలుగువేలకు పైగా మరణాలు చోటు చేసుకొన్నాయి. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో  మరణించిన వారి సంఖ్య 4,167కి చేరుకొంది.  దేశంలో ఇప్పటివరకు 2,71,57,795 మందికి కరోనా సోకింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,11,388కి చేరుకొంది. 24 గంటల్లో కరోనా నుండి 2,95,955 మంది కోలుకొన్నారు. గత 13 రోజులుగా కరోనా బారి నుండి కోలుకొన్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.  కరోనా కేసులతో పాటు రికవరీ అవుతున్న కేసుల సంఖ్య కూడ భారీగానే ఉంది.రికవరీ రేటు 89.25 శాతానికి చేరింది.  దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 24,95,591కి చేరుకొంది.