అత్యధిక జనాభా గల దేశంగా భారత్ వచ్చే ఏడాదిలో అవతరిస్తుందని ఐరాస రిపోర్టు ఒకటి అంచనా వేసింది. వచ్చే ఏడాదిలో చైనా కంటే ఎక్కువ జనాభా గల దేశంగా భారత్ నిలుస్తుందని వివరించింది. అదే నివేదిక ప్రపంచవ్యాప్తంగా సగటు పౌరుడి జీవిత కాలం తగ్గినట్టు తెలిపింది. 

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం చైనా. అయితే, ఈ ట్యాగ్ వచ్చే ఏడాదిలో మారుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి అంచనా వేసింది. 2023 సంవత్సరంలో చైనాను భారత్ బీట్ చేస్తుందని తెలిపింది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలుస్తుందని వివరించింది. 

2023లో భారత్ చైనాను దాటేసి అత్యధిక జనాభా గల దేశంగా నిలుస్తుందని యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌బమెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, పాపులేషన్ డివిజన్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 వెల్లడించింది. అంతేకాదు, 2022 నవంబర్ 15వ తేదీ కల్లా ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. 

2050లోపు ప్రపంచంలో పెరుగుతున్న అత్యధిక జనాభా ప్రధానంగా ఎనిమిది దేశాల్లో కనిపిస్తుందని ఆ నివేదిక తెలిపింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల్లో ఈ మార్పు ఉంటుందని వివరించింది. చైనా, భారత్‌లు 140 కోట్ల జనాభాతో దక్షిణాసియాలో అత్యధిక జనాభా గల దేశాలుగా ఉంటాయని తెలిపింది.

తగ్గిన సగటు జీవిత కాలం

కరోనా కారణంగా మనిషి సగటు జీవిత కాలం తగ్గిపోయింది. 2019లో మనిషి సగటు జీవిత కాలం 72.8 ఏళ్లుగా ఉండగా, 2021లో 71 సంవత్సరాలు ఉంటుందని ఇదే నివేదిక తెలిపింది. కరోనా కారణంగా సగటు ఆయుష్షు పడిపోయిందని వివరించింది.

2022లో 65 ఏళ్లకు పైబడిన వారి జనాభా 10 శాతం నుంచి 2050 కల్లా 16 శాతానికి పెరుగుతుందని తెలిపింది.

సంపన్న దేశాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా వలసల వల్ల కలుగుతుందని ఈ నివేదిక తెలిపింది. కాగా, పేద, మధ్య ఆదాయ దేశాల్లో మరణాల కంటే జననాల రేటు ఎక్కువగా ఉండటం మూలంగా జనాభా పెరుగుతుందని పేర్కొంది.