పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను భారత్ లో విలీనం చేయాలంటూ ఎన్సీపీ కొత్త వాదన తెర మీదకు తీసుకువచ్చింది.  పాక్, బంగ్లాదేశ్ లను భారత్ తోపాటు ఏకం చేయాలని బీజేపీ భావిస్తే.. అందుకు తమ ఎన్సీపీ పార్టీ కూడా మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

కరాచీ భారత్‌లో భాగం​ అవుతుందన్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. ఫడ్నవిస్‌ వ్యాఖ్యలపై స్పందించిన మాలిక్‌ ఆదివారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ..'పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లు కూడా భారత్‌లో విలీనం కావాలని మేం భావిస్తున్నాం. బెర్లిన్‌ గోడను పడగొట్టగలిగితే.. పాక్‌, బంగ్లాదేశ్‌  భారత్‌లో ఎందుకు విలీనం కావు?  ఒకవేళ ఈ మూడింటిని కలిపి ఒకే దేశంగా మార్చాలని బీజేపీ కోరుకుంటే దాన్ని మేము స్వాగతిస్తాం'అని పేర్కొన్నారు.

ముంబై మున్సిపల్ ఎన్నికల్లోనూ(బిఎంసి) తాము శివసేనతో కలిసే పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా 15 నెలలు మిగిలి ఉన్నాయని, ఆయా  పార్టీలను పటిష్ఠం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. తాము కూడా తమ పార్టీని బలపరిచేందుకు సిద్ధమవుతున్నామని, శివసేన కోరుకుంటే కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు మాలిక్‌ పేర్కొన్నారు.