విక్రమ్-ఎస్ రాకెట్ ను శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగకేంద్రం నుండి ఇవాళ ప్రయోగించారు. ఇస్రో కేంద్రం నుండి తొలిసారిగా ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించారు.
శ్రీహరికోట: శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి విక్రమ్ -ఎస్ అనే ప్రైవేట్ రాకెట్ ను శుక్రవారంనాడు విజయవంతంగా ప్రయోగించారు. దేశీయంగా ప్రైవేట్ రంగంలో రూపొందించిన తొలి రాకెట్ విక్రమ్-ఎస్ .హైద్రాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ ఈ రాకెట్ ను రూపొందించింది.ఇస్రో చరిత్రలో తొలిసారి ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించింది.విక్రమ్-ఎస్ రాకెట్ అనేది సింగిల్ స్టేజ్ సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్, ఇది మూడు కస్టమర్ పేలోడ్ లను తీసుకెళ్తుంది.
83 కిలోల బరువున్న మూడు పేలోడ్లతో రాకెట్ 89.5 కి.మీ ఎత్తుకు చేరుకుంది. శ్రీహరికోట నుండి ప్రయోగించిన తర్వాత బంగాళాఖాతంలోకి రాకెట్ సురక్షితంగా దూసుకెళ్లింది.ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మెన్ ప్రకటంచిన తర్వాత కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ మాట్లాడారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి కొత్త ఆరంభం ప్రారంభమైందన్నారు.స్వంత అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో ఇది ఒక ప్రధాన అడుగు అని ఆయన చెప్పారు.అంతరిక్షంలో కొత్త మిషన్లను ప్రోత్సహిస్తున్నందుకు మోడీకి కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ధన్యవాదాలు తెలిపారు. విక్రమ్ ఎస్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.
భారత అంతరిక్ష కార్యక్రమ వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్‌కు నివాళిగా స్కైరూట్ ప్రయోగ వాహనాలకు విక్రమ్ అని పేరు పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు అత్యాధునిక అంతరిక్ష ప్రయోగ వాహనాలను తయారు చేస్తోంది.
