Leopard Population: చిరుతపులుల జనాభా పెరుగుదల .. మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో తెలుసా…?
Leopard Population: ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్యలో పెరుగుదల కనిపించగా.. తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దేశ వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిపిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
Leopard Population: దేశంలో చిరుత పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇదే విషయాన్ని నేషనల్ టైగర్ రిజర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక తేటతెల్లం చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ గురువారం వీటి నివేదికను విడుదల చేసింది. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2018-2022 మధ్య కాలంలో దేశంలోని పెద్ద పులులు, చిరుత పులులు సంఖ్య పెరిగింది.
ఈ కాలంలో 1.08 శాతం వృద్ధితో చిరుతల సంఖ్య 13,874కి చేరుకున్నట్టు అంచనా. ఇది 2018లో 12,852 కంటే అధికమని నివేదిక పేర్కొంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 3907 చిరుతపులులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(1985), కర్ణాటక(1879), తమిళనాడు(1070) ఉన్నాయి.
ఇక టైగర్ రిజర్వుల పరంగా చూస్తే.. నాగార్జున సాగర్-శ్రీశైలం(ఏపీ), పన్నా(మధ్యప్రదేశ్), సాత్పురా(మధ్యప్రదేశ్) ప్రాంతాల్లో చిరుతల జనాభా ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా మధ్య భారతంలో చిరుతపులుల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నట్లు నివేదిక చూపించింది.
శివాలిక్ కొండలు, గంగా మైదాన ప్రాంతాల్లో వీటి జనాభా క్షీణించినట్లు పేర్కొంది. మధ్యభారతం, తూర్పు కనుమల్లో వృద్ధి ఉంది. కానీ, శివాలిక్ కొండలు, గంగా మైదాన ప్రాంతాల్లో వాటి జనాభా క్షీణించినట్లు తెలిపింది. చిరుతపులి జనాభాలో సంవత్సరానికి 3.4 శాతం క్షీణత ఉన్నట్టు గుర్తించింది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో చిరుతల సంఖ్య తగ్గగా.. ఏపీలో పెరుగుదల కనిపించింది. ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణలో 2018లో 334 చిరుతపులుల నుండి 2022 నాటికి 297కి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో వాటి సంఖ్య 2018లో 492గా ఉండగా, 2022లో 569కి పెరిగిందని నివేదిక పేర్కొంది. తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 121 చిరుతపులులు ఉన్నట్టు గుర్తించారు.
మొత్తం 173 చిరుతపులులు రిజర్వ్ రక్షిత అడవుల వెలుపలి ప్రాంతాల నుండి దాని సరిహద్దుల్లోకి , వెలుపలికి వెళ్లడానికి టైగర్ రిజర్వ్‌ను ఉపయోగించుకుంటున్నాయని అంచనా. గత పులుల గణన ప్రకారం ఒక్క పులి కూడా నమోదు కానటువంటి కవాల్ టైగర్ రిజర్వ్ విషయంలో రిజర్వ్‌లో 19 చిరుతలు కనిపించగా, 25 రిజర్వ్‌ను ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో 270 చిరుతపులులను గుర్తించారు. మరో 90 చిరుతలను రిజర్వ్ పారెస్ట్ లో ఉన్నట్టు అంచనా.
తగ్గడానికి కారణాలివే..
తెలంగాణలో చిరుతపులి సంఖ్య తగ్గడంపై రాష్ట్ర అటవీ శాఖ సీనియర్ అధికారిని అడగ్గా.. చిరుతపులి సంఖ్యను అంచనా వేయడానికి అనుసరించిన పద్దతిని అధ్యయనం చేసిన తర్వాతే నివేదికను పరిశీలించిన తర్వాత మాత్రమే వాస్తవ కారణాలు వస్తాయని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, తెలంగాణలో చిరుతపులి మరణాలు కొంత క్రమపద్ధతిలో నమోదవుతున్నాయని, చాలాసార్లు హిట్ అండ్ రన్ ప్రమాదాలలో వన్య ప్రాణులు చనిపోతున్నాయని అటవి శాఖ అధికారులు తెలిపారు.
జనవరి నుండి ఇప్పటివరకు రెండు చిరుతపులులు చనిపోయాయి, రంగారెడ్డి జిల్లాలో ఒకటి, నారాయణపేట జిల్లాలో మరొకటి. తెలంగాణలో చిరుతపులి సంరక్షణకు సమర్థవంతమైన పెట్రోలింగ్, అటవీ చట్టాల అమలు చేయడం చాలా కీలకమని నివేదిక పేర్కొంది. ఉత్తర తెలంగాణలో చిరుతలు కొత్త ప్రాంతాలను ఆక్రమించాయని గుర్తించగా, కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యంలో ఆక్రమం తగ్గిందని పేర్కొంది.