India–Israel Relations: సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై  ఇజ్రాయెల్ రాయబారి గిల్లాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సహకారానికి గొప్ప ఉదాహరణ అని అన్నారు. రాయబారి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) సంస్థల పనితీరును ప్రశంసించారు   

India–Israel Relations: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ ఢిల్లీలోని కృషి భవన్‌లో కలిశారు. భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారిగా బాధ్యతలు స్వీకరించినందుకు నౌర్ గిలోన్ ను తోమర్‌ అభినందించారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు 30 సంవత్సరాలు పూర్తయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు మంత్రి తోమర్.

వీరివురి భేటీలో దేశంలోని 12 రాష్ట్రాల్లో 29 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కేంద్రాలలో 25 మిలియన్లకు పైగా కూరగాయల మొక్కలు, 3.87 లక్షలకు పైగా పండ్ల మొక్కలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఏటా 1.2 లక్షల మందికి పైగా రైతులకు శిక్షణ ఇస్తున్నారు. 
ఇజ్రాయెల్ సాంకేతిక సహకారంతో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ చుట్టూ ఉన్న 150 గ్రామాలను విలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మార్చాలని నిర్ణయించామని మంత్రి తోమర్ అన్నారు. తొలి ఏడాదిలో భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గుర్తుగా.. 75 గ్రామాలను తీసుకున్నామ‌ని తెలిపారు.

వ్యవసాయం, ఉద్యానవన రంగం అభివృద్ధికి భారత్, ఇజ్రాయెల్ కలిసి పని చేస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల సంక్షేమం కోసం పీఎం-కిసాన్, అగ్రి-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, 10 వేల ఎఫ్‌పీఓల ఏర్పాటు, సేంద్రీయ, సహజ వ్యవసాయం ప్రోత్స‌హించ‌డం లాంటి పథకాలతో సహా రైతుల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాలను తోమర్ హైలైట్ చేశారు. 

అనంత‌రం ఇజ్రాయెల్ రాయబారి గిల్లాన్ మాట్లాడుతూ..సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవన్నీ ఇరు దేశాల మధ్య సహకారానికి గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) సంస్థల పనితీరును ప్రశంసించారు. ICARకు మరింత సహకారం అందించడానికి.. సాంకేతికతలను అందుబాటులోకి తీసుకురావడానికి త‌మ దేశం ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుందని తెలిపారు. రైతులకు అందజేస్తున్న సేవ ప్రమాణాలు, నాణ్యతను మరింత మెరుగుపరచడానికి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సర్టిఫికేషన్‌ను ఆయన ప్రతిపాదించారు. ఇజ్రాయెల్‌లో పర్యటించాల్సిందిగా మంత్రి తోమర్‌ను ఆయన ఆహ్వానించారు. 

భారతదేశంలో వ్యవసాయం పురోగతిలో ఇజ్రాయెల్ కీల‌క‌ సహకారం అందించింది. కూరగాయలు మరియు పండ్ల కోసం దాని అనుబంధంతో భారతదేశంలో అనేక ఎక్సలెన్స్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా హర్యానాలో అనేక ప్రాజెక్టులు నిర్వ‌హిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వ‌ల్ల భారతీయ రైతులు నూత‌న వ్య‌వసాయ మేలుకువ‌ల‌ను నేర్చుకుంటున్నారు. ఢిల్లీలోని పూసా క్యాంపస్‌.. భారత్,ఇజ్రాయెల్ మధ్య వ్యవసాయ రంగంలో సహకారానికి ఓ ఉదాహరణ. దీనిని 1996లో ప్రారంభించారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రస్తుతం, కూరగాయలు, పండ్ల ఉత్ప‌తి కోసం దేశంలో సుమారు 30 ఎక్సలెన్స్ కేంద్రాలు నడుస్తున్నాయి.