Asaduddin Owaisi: మహారాష్ట్రలోని భివాండీలో జరిగిన ర్యాలీలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ల‌పై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. భారతదేశం నాది కాదు.. మోదీ- షాలది కాదని, ద్రావిడులు, ఆదివాసీలే ఈ దేశానికి అస‌లైన వారసుల‌ని సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. ఈడీ దాడులతో తమ ఎమ్మెల్యేలు అశాంతికి గురవుతున్నారని విమ‌ర్శించారు. 

Asaduddin Owaisi: భారతదేశం థాకరే, మోదీ, షాలది కాదని, ద్రావిడులు, ఆదివాసీల‌దని, ఆఫ్రికా, ఇరాన్, మధ్య ఆసియా, తూర్పు ఆసియా దేశాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు భారత్ ఏర్పడిందని, వారే ఈ దేశానికి నిజ‌మైన వార‌సుల‌ని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మహారాష్ట్రలోని భివాండీలో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మొఘల్‌ల గురించి నిత్యం వక్కాణిస్తున్నాయని, ఆఫ్రికా, ఇరాన్, మధ్య ఆసియా, తూర్పు ఆసియా నుండి ప్రజలు వలస వచ్చిన తర్వాత భారతదేశం ఏర్పడిందని అన్నారు.

నేడు దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి ఎవరూ మాట్లాడడం లేదని, ఈ సమస్యలకు కూడా మొఘలులే కారణమా? ఔరంగజేబు భారతదేశంలో నిరుద్యోగాన్ని పెంచారా? అని ప్రశ్నించారు. ఈరోజు ముస్లింలకు బీజేపీ భయ‌ప‌డుతోంద‌ని, బీజేపీ-సంఘ్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇదే కొనసాగితే.. ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుందని అన్నారు. కాశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగి హత్యకు బాధ్యులెవరు? అని నిలదీశారు. జ్ఞాన్‌వాపి మసీదు, తాజ్‌మహల్, కుతుబ్‌మినార్‌లపై జరుగుతున్న వివాదాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కలిసి ముస్లింల చిహ్నాలను చెరిపివేయాలనుకుంటున్నాయని, టోపీ, మసీదు దేశానికి ప్రమాదమా.. అని ప్రశ్నించారు.


ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కూడా ఒవైసీ టార్గెట్ చేశారు. ఎన్సీపీకి నవాబ్ మాలిక్ కంటే సంజయ్ రౌత్ ముఖ్యమైపోయారా? ఒవైసీ ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో శివసేన, బీజేపీలను అడ్డుకునేందుకు ఏఐఎంఐఎంకు ఓటు వేయవద్దని కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజలను కోరాయని ఒవైసీ ఆరోపించారు. ఎన్నికల అనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రత్యర్థి శివసేనతో పొత్తు పెట్టుకున్నాయని విమ‌ర్శించారు.

2020లో అరెస్టయిన ఏఐఎంఐఎం భివాండీ నాయకుడు ఖలీద్ గుడ్డూ, నవాబ్ మాలిక్‌ను కూడా విడుదల చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. గుడ్డును నిర్దోషిగా అభివర్ణించిన AIMIM చీఫ్, అతన్ని విడుదల చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను అభ్యర్థించారు. ఖలీద్ గుడ్డును విడుదల చేయాలని శివసేనను, ముఖ్యమంత్రిని కోరుతున్నాను. నేడు అమాయకులు జైలులో ఉంటే, రేపు బలవంతులు జైలులో ఉండవచ్చు. అధికారం అమాయకుల చేతుల్లోకి కూడా రావొచ్చున‌ని అన్నారు.