Asianet News TeluguAsianet News Telugu

తాలిబాన్ ప్రభుత్వంపై భారత్ తొలి కామెంట్.. సర్కారు కూర్పుపై ఆందోళన

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ప్రకటించిన ప్రభుత్వంపై మనదేశం తొలిసారి వ్యాఖ్యానించింది. అందరూ పురుషులతో ఏర్పడిన ఆ ప్రభుత్వంలో ఇతరవర్గాలను చేర్చకపోవడంపై ఆందోళన వ్యక్తపరిచింది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ మహిళల హక్కులపై తాము కలరవపడుతున్నట్టు ఆస్ట్రేలియా మంత్రి పేర్కొన్నారు.

india first comment came on taliban government in afghanistan
Author
New Delhi, First Published Sep 11, 2021, 5:44 PM IST

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ప్రకటించిన ప్రభుత్వంపై భారత్ తొలిసారిగా కామెంట్ చేసింది. ఆ ప్రభుత్వంలో సభ్యుల కూర్పుపై ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు, ఇతరులకు చోటు కల్పించకపోవడాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఎస జైశంకర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్, ఆస్ట్రేలియాల రక్షణ శాఖ, విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు ఉభయ దేశాలకు ఆందోళనకరంగా ఉన్నాయని సంయుక్తంగా ప్రకటించారు. ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ఆస్ట్రేలియా మంత్రి మెరిస్ పైన్ సమర్థించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల పురోగతిపై ఆస్ట్రేలియా కూడా ఆందోళనవ్యక్తం చేస్తున్నదని వివరించారు. ఇతర ఉగ్రవాదుల శిబిరాలకు ఆఫ్ఘనిస్తాన్ ఒక డెన్‌గా మారకూడదని ఆమె ఆశించారు.

అందరూ పురుషులే ఉన్న తాలిబాన్ ప్రభుత్వాన్ని ఈ నెల 7న వారు ప్రకటించారు. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పై దాడి జరిగిన సెప్టెంబర్ 11నే తాలిబాన్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని వెల్లడించారు. కానీ, దోహాలోని తాలిబాన్ ప్రతినిధుల ఒత్తిడితో ప్రమాణ స్వీకారాన్ని నిలిపేసినట్టు తెలిసింది. నేటితో 9/11 ఘటనకు 20 ఏళ్లు నిండాయని, ఇప్పటికైనా ఉగ్రవాదంపై పోరాటాన్ని చిన్నచూపు చూసే దేశాలు దీన్ని గుర్తుంచుకోవాలని ఎస్ జైశంకర్ వివరించారు. నాటో వెనుకబడ్డ పదంగా కనిపిస్తున్నదని, ముందున్న దారి క్వాడ్ రూపంలో ప్రజ్వరిల్లుతున్నదని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్‌ పరిణామాలపై ఇండియాతోపాటు ఆస్ట్రేలియా కూడా అప్రమత్తతో ఉన్నదని ఆ దేశ మంత్రి వివరించారు. క్వాడ్ దేశాల్లో ఇండియా, ఆస్ట్రేలియాలతోపాటు అమెరికా, జపాన్‌లున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios