ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖుదేల్ గ్రామంలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...  మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ ప్రాంతానికి చెందిన అభిషేక్ సక్సేనా (45) తన భార్య ప్రీతీ సక్సేనా(42), పిల్లలు ఆదిత్య (14) అనన్య 14)లతో కలిసి ఖుదేల్ గ్రామంలోని వాటర్ పార్కు హోటల్‌లో దిగారు. 

హోటల్ గదిలో దిగిన కుటుంబం రోజంతా బయటకు రాలేదు. దీంతో సిబ్బంది తలుపు తట్టినా ఎవరూ తీయక పోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా నలుగురి మృతదేహాలు కనిపించాయి. విషం బాటిల్ కూడా హోటల్ గదిలో లభించింది. కుటుంబసభ్యులు హోటల్ గదిలో దిగి విషం తాగి ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు చెప్పారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.