ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 107వ స్థానానికి పడిపోయింది. గతేడాది 101వ స్థానంలో ఉన్నది. మొత్తం 121 దేశాల్లో భారత్ 107వ స్థానంలో ఉండటమంటే దాదాపు అట్టడుగుకు చేరిందని కాంగ్రెస్ నేత పి చిదంబరం కేంద్రాన్ని విమర్శించారు.
న్యూఢిల్లీ: ప్రపంచ ఆకలి సూచీలో భారత్ మరింత దిగజారిపోయింది. గతేడాది ఈ సూచీలో భారత్ 101వ స్థానంలో ఉండగా తాజా జాబితాలో మన దేశం 107వ స్థానానికి పడిపోయింది. దక్షిణాసియాలో దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ మినహా అన్నింటి కంటే మన దేశమే వెనుకబడి ఉన్నది. మన పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ కంటే కూడా భారత స్థానం వెనుకబడి ఉండటం గమనార్హం. కాగా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ 5 లోపే ఉండి ప్రపంచంలోనే టాప్ ర్యాంకుల్లో చైనా, టర్కీ, కువైట్ వంటి దేశాలు ఉన్నాయి.
ఈ రిపోర్టును ఐరిష్ ఏజెన్సీ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మనీ సంస్థ వెల్ట్ హంగర్ హిల్ఫెలు సంయుక్తంగా రూపొందించాయి. భారత్‌లో ఆకలి స్థాయి సీరియస్‌గా ఉన్నదని ఈ సంస్థలు తమ జాబితాలో పేర్కొన్నాయి. 2021లో మొత్తం 116 దేశాల్లో భారత్ 101వ స్థానంలో నిలించింది. తాజాగా మొత్తం 121 దేశాల్లో 107వ స్థానంలో ఉన్నది.
శ్రీలంక 64వ స్థానం, నేపాల్ 81వ స్థానం, బంగ్లాదేశ్ 84వ స్థానం, పాకిస్తాన్ 99వ స్థానాల్లో ఉన్నాయి. కాగా, భారత్ కంటే వెనుకగా 109వ స్థానంలో అఫ్ఘనిస్తాన్ ఉన్నది. అఫ్ఘనిస్తాన్‌లో కొన్ని సంవత్సరాలుగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
Also Read: 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతం అంతర్జాతీయ సూచీల్లో ఎక్కడ నిలుస్తున్నది?
జీహెచ్ఐ స్కోరు ఆధారంగా దేశాల ర్యాంకులు కేటాయిస్తారు. ఈ జీహెచ్ఐ స్కోరును నాలుగు అంశాల ఆధారంగా తయారు చేశారు. సరిపడా పోషకాలు అందకపోవడం, చైల్డ్ వెస్టింగ్ (పిల్లలు ఎత్తుకు తగినట బరువు లేకపోవడం), చైల్డ్ స్టంటింగ్ (వయసుకు తగిన ఎత్తు లేకపోవడం), శిశు మరణాల రేటు ఆధారంగా ఈ జీహెచ్ఐ స్కోరును తయారు చేశాయి.
ఈ రిపోర్టు రాగానే కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరం కేంద్రంపై విమర్శలు సంధించారు. చిన్న పిల్లల్లో పోషకాహారలోపం, ఆకలి, స్టంటింగ్, వెస్టింగ్ వంటి వాస్తవ సమస్యలపై గౌరవనీయులైన ప్రధానమంత్రి ఎప్పుడు మాట్లాడుతారని ప్రశ్నించార. మన దేశంలో 22.4 కోట్ల ప్రజలు పోషకాహారలోపంతో బాధపడుతున్నట్టు పరిగణించారని ట్వీట్ చేశారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో మొత్తం 121 దేశాల్లో 107వ స్థానం అంటే దాదాపు చిట్టచివరన భారత్ ఉన్నదని పేర్కొన్నారు.
Also Read: మానవాభివృద్ధి సూచీలో దిగజారిన భారత్ ర్యాంక్
గతేడాది రిపోర్టును భారత్ తిప్పికొట్టింది. ఈ రిపోర్టు షాకింగ్‌గా ఉన్నదని, రిపోర్టు తయారీలో శాస్త్రీయ విధానం అవలంభించలేదని కొట్టిపారేసింది. అయితే, ఈ ఆరోపణలను ఏజెన్సీలు తప్పుపట్టాయి. చిన్నపాటి ఫోన్ కాల్స్ ఆధారంగా తయారు చేసింది కాదనీ, ఆయా ప్రభుత్వాలు యూఎన్‌కు సమర్పించిన నివేదికల ఆధారంగా తయారు చేసినవని వివరించింది.
