Asianet News TeluguAsianet News Telugu

భారత్ కుప్పకూలిపోయే ముప్పు ఉన్నది.. ఐక్యంగా ఉండాలి: నోబెల్ గ్రహీత అమర్త్యసేన్

ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ భారత ప్రజలకు హెచ్చరికలు, సూచనలు చేశారు. ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లో మాట్లాడుతూ, భారత్ నేడు కుప్పకూలిపోయే ప్రమాద ముంగిట్లో ఉన్నదని హెచ్చరించారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని, మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలని సూచించారు.
 

india facing possible collapse threat.. should unite irrespective of religions says nobel laureate amartya sen
Author
Kolkata, First Published Jul 1, 2022, 1:31 PM IST

కోల్‌కతా: ప్రముక ఆర్థిక వేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లో మాట్లాడారు. కోల్‌కతాలో అమర్త్యసేన్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు కొన్ని హెచ్చరికలు.. కొన్ని సూచనలు చేశారు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ఏరియాలో ఆయన మాట్లాడుతూ, దేశం నేడు ఓ ఉత్పాతం ముంగిట్లో ఉన్నదని తెలిపారు. దేశం మొత్తంగా కుప్ప కూలిపోయే ముప్పును భారత్ ఎదుర్కొనే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. 

ప్రజల మతాల వారీగా విడిపోవద్దని, అందరూ ఐక్యం కావడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని సూచించారు. ఎవరైనా ఇప్పుడు తనను దేనికోసమైనా భయపడుతున్నారా? అని అడిగితే ఔననే చెబుతానని వివరించారు. ఇప్పుడు భయపడటానికీ ఓ కారణం ఉన్నదని తెలిపారు. నేడు దేశంలోని పరిస్థితులే భయాలకు కారణంగా మారాయి అని చెప్పారు. 

ఈ దేశ ప్రజలు అందరూ సమైక్యంగా కలిసి ఉండటమే తనకు కావాలని వివరించారు. చారిత్రకంగా ఉదారవాదంతో మెదిలిన ఈ దేశం ఇప్పుడు విచ్ఛిన్నం కావడాన్ని తాను ఇష్టపడటం లేదని చెప్పారు.

హిందువులకు చెందిన ఉపనిషత్తులు ప్రపంచానికి ఒక ముస్లిం రాకుమారుడితో తెలియవచ్చిందని అన్నారు. షా జహాన్ కుమారుడు దారా సిఖో సంస్కృతాన్ని నేర్చుకున్నాడని, ఆయన ఉపనిషత్తులను పర్షియా భాషలోకి మార్చారని వివరించారు. 

భారత్ కేవలం హిందువులకే చెందినది కాదని, అలాగే కేవలం ముస్లింలదే కాదనీ అన్నారు. దేశ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ రెండు వర్గాలు కలిసి ఉండాలని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios