భారతదేశంలో కోవిడ్‌ను నియంత్రించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొవాగ్జిన్, కోవిషీల్డ్‌లను అత్యవసర వినియోగానికి అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మనదేశంలోనే మరో ఏడు వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయట. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ వెల్లడించారు. 

కేవలం రెండు టీకాలపైనే ఆధారపడలేమని ఆయన పేర్కొన్నారు. భారత్‌ పెద్ద దేశం కావడంతో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించేలా పలు కంపెనీలు పరిశోధనలు చేస్తున్నట్లు హర్షవర్థన్ వివరించారు.

ఈ ఏడు వ్యాక్సిన్లలో మూడు క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. దేశంలోని ప్రతిఒక్కరికి టీకా అందించేలా చర్యలు చేపడుతున్నామని.. వ్యాక్సిన్‌ను బహిరంగ మార్కెట్‌లో ఉంచేందుకు ప్రభుత్వం వద్ద తక్షణ ప్రణాళిక ఏమీ లేదని ఆరోగ్య మంత్రి తేల్చి చెప్పారు.

ఈ అంశంపై డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటామని హర్షవర్ధన్‌ వెల్లడించారు. 50 ఏళ్లకు పైబడినవారికి కరోనా టీకా పంపిణీని మార్చిలో ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.