కరోనా మహమ్మారి భారత్ లో విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఊహించని రీతిలో కొత్త కేసులు పుట్టుకువస్తున్నాయి. మొన్నటి వరకు అమెరికా కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికీ అగ్రరాజ్యమే.. ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అక్కడి కన్నా ఎక్కువ కేసులు భారత్ లోనే నమోదవ్వడం గమనార్హం.

ఇప్పుడు భార‌త్‌లో అమెరికాను మించి కేసులు న‌మోద‌వుతున్నాయి. గడ‌చిన‌ 24 గంటల్లో అమెరికాలో సుమారు 46 వేల కేసులు నమోదుకాగా, భారతదేశంలో 50 వేలకు పైగా కేసులు న‌మోద‌య్యాయి. బ్రెజిల్‌లో కొత్త కేసుల సంఖ్య‌ 18 వేలకు దగ్గరగా ఉంది. అమెరికా కంటే భారత్‌లో అధికంగా కేసులు రావడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం.

అంత‌కుముందు రోజు భారతదేశంలో సుమారు 52 వేల కొత్త క‌రోనా కేసులు న‌మోదుకాగా, అమెరికాలో ఈ సంఖ్య 47 వేలకు దగ్గరగా ఉంది. భారతదేశంలో ఇప్పటివరకు 18.55 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. 39 వేల మంది మృతిచెందారు. 12,30,000 మందికి పైగా బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం 5.85 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 8,944 మంది తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. 

భారత్ లో ప్రతిరోజూ దాదాపు అర లక్ష మంది వైరస్ బారిన పడటం అందరినీ కలవరపెడుతోంది. ఈ వార్తలు కొందరిని తీవ్రంగా కలవరపెడుతుంటే.. మరికొందరు ఇప్పటికీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుండటం గమనార్హం.