భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండం చేస్తూనే ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46,433కు చేరింది. కాగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా 1,568మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా..ఇప్పటి వరకు 12,726 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 32,138 ఉంది. రికవరీ రేటు 27.52 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ  విడుదల చేసిన హెల్త్ బులిటెన్ తెలిపింది. 

కాగా.. ఈ వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోవడంతో దేశంలో లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. మే 17వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ విధించింది. ఆ తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం కేసులు అదుపులోకి వస్తే లాక్ డౌన్ ని కాస్త సడలించే అవకాశం ఉంది.

కాగా.. ఇప్పటికే కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగానే, కాస్త తక్కువగా ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా.. అసలు లేని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించారు.

మే 17 తర్వాత గ్రీన్ జోన్లలో కాస్త లాక్ డౌన్ ని సడలించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన లేదు.

ముంబైలో కరోనా మంట చల్లారడం లేదు. ఆదివారంనాడు ముంబైలో కొత్తగా 441 కేసులు నమోదు కాగా, 21 మంది మరణించారు. దీంతో ముంబైలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,613కు చేరుకుంది. మరణాల సంఖ్య 343కు చేరింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 12,296కు చేరుకుంది. మొత్తం రాష్ట్రంలో 521 మంది మరణించారు.

ప్రపంచ వ్యాప్తంగా 35 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా.. వీటిలో ఎక్కవ కేసులు అగ్రరాజ్యం అమెరికాలోనే చోటుచేసుకోవడం గమనార్హం. అక్కడ మృతుల సంఖ్య 60వేలు దాటింది.