భారత్ లో కరోనా విజృంభణ.. నిన్న ఎన్ని పెరిగాయంటే...
దాదాపుగా ప్రతీ రోజు కూడా 4 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న కూడా 5వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. కాగా.. దేశంలో కరోనా కేసులు లక్ష దాటేశాయి.
కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకీ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ కేసులు భారీగా పెరగడం గమనార్హం. గత రెండు రోజులుగా లాక్ డౌన్ కాస్త సడలించడంతో కేసులు మరిన్ని పెరుగుతున్నాయి.
దాదాపుగా ప్రతీ రోజు కూడా 4 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న కూడా 5వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.
కాగా.. దేశంలో కరోనా కేసులు లక్ష దాటేశాయి.మొత్తంగా 1,12,359 కేసులు నమోదు కాగా 3,435 మంది మరణించారు.
కాగా.. ఇప్పటి వరకు దేశంలో 42,298 మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారులు చెప్పారు.
అయితే దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు నెలలుగా కరోనా రోగులకు చికిత్స అందిస్తోన్న ఎయిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటివరకు 92మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
ఎయిమ్స్ ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన అధ్యాపకునికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో దాదాపు పదిమంది సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు.
మొత్తం 92మందిలో ఒకరు అధ్యాపకులు, ఇద్దరు రెసిడెంట్ వైద్యులు, 13మంది నర్సింగ్ సిబ్బంది, 45మంది సెక్యూరిటీ గార్డులతో పాటు మరో 12మంది పారిశుద్ధ్య కార్మికులకు వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలాఉండగా దిల్లీలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలు దాటగా 160మంది మరణించారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 35,058 కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా 50లక్షల మంది పైగా కరోనా సోకింది. గత 24గంటల్లోనే లక్ష మందికి ఈ వైరస్ సోకడం గమనార్హం. తాజాగా అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం నిన్న ఒక్క రోజే 1,01,876 మందికి కరోనా సోకింది. మొత్తంగా 50 లక్షల మందికి కరోనా సోకింది.
మొత్తంగా 50,82,661మందికి కరోనా సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. చాలా దేశాల్లో కరోనా వైరస్ ని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు. అయితే.. లాక్ డౌన్ విధించి నెలలు గడుస్తున్నా.. మార్పు ఉండకపోవడంతో విధించిన లాక్ డౌన్ ని సడలిస్తూ వస్తున్నారు.
కాగా.. ఈ సడలింపులతో కరోనా కేసులు మరింత ఎక్కువగా పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 50లక్షలు దాటేశాయి. కాగా.. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా 3,29,294 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 4,923 మంది మరణించారు. ఇక, 20,20,157 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.