భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఊహించని రీతిలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24గంటల్లో దాదాపు 17వేల కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్క రోజే 16,922 కొత్త కేసులు నమోదయ్యాయి. 418 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా 4,73, 105కు కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ అధికారులు గురువారం బులిటెన్ విడుదల చేశారు. 

వారు తెలిపిన వివరాల ప్రకారం  ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 14,894 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి 2,76 లక్షల మంది కోలుకున్నారు. భారత్ లో 1,86,517 యాక్టివ్ కేసలు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రోజురోజకూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇక ఢిల్లీలో ప్రపంచంలోని ఇతర నగరాల కంటే ఒక్క‌ రోజులో అత్య‌ధికంగా క‌రోనా కొత్తకేసులు న‌మోద‌య్యాయి. ఢిల్లీలో సావోపాలో (బ్రెజిల్), శాంటియాగో (చిలీ), లిమా (పెరూ) న‌గ‌రాల కంటే అత్య‌ధిక క‌రోనాకేసులను నమోద‌య్యాయి. లాటిన్ అమెరికాలోని ఈ మూడు మెట్రోపాలిటన్ నగరాలు గ్లోబల్ కోవిడ్ -19 హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి. జూన్ 23న న్యూయార్క్, మాస్కోలో న‌మోదైన కొత్త కేసులకు మించి ఢిల్లీలో కేసులు న‌మోద‌య్యాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభణ భయంకరంగా మారిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పదివేలు దాటేశాయి. ప్రతిరోజూ దాదాపు వెయ్యి కేసులు నమోదౌతున్నాయి. ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది.