భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 11,16,842 కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 90,122 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. దీంతో.. బుధవారం నాటికి దేశంలో కరోనా కేసులు 50లక్షలు దాటిపోయాయి. మొత్తం దేశంలో కరోనా కేసులు 50,20,359 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

వీరిలో ఇప్పటికే 39లక్షల మంది కోలుకోగా మరో 9లక్షల 95వేల కేసులు ఉన్నట్లు తెలిపింది. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 82వేల మంది కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఒక్క రోజులో 1290 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.

కాగా.. రోజువారీ మరణాలు 1200 దాటడం ఇది మూడోసారి కావడం గమనార్హం.  దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 82,066కి చేరింది. అయితే.. కోవిడ్ 19తో మరణిస్తున్న వారిలో దాదాపు 70శాతానికి పైగా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారేనని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితదుల రికవరీ రేటు 78.5శాతానికి చేరుకుంది. రికవరీ రేటు ఎక్కువ గా ఉంటడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది.